Monday, April 28, 2025

పిఒకె లో ఆకస్మిక భారీ వరదలు

- Advertisement -
- Advertisement -

పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఒకె)లో రెండు రోజులుగా ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీనితో ఇక్కడి జనం అతలాకుతలం అవుతున్నది. జీలం నది జలాలను భారతదేశం తన భూభాగంలోకి విడుదల చేయడంతో ఈ వరదల ముప్పు తలెత్తిందని పాకిస్థాన్ అధికారిక నిరసన వ్యక్తం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధానికి తోడుగా ఇప్పుడు నదీజలాల వివాదం రగులుకుంది. పిఒకెలోని హట్టియన్ బాలాలో ఇప్పుడు జల అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. దూర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వారు సిద్ధం అయ్యారు. భారతదేశం ప్రతీకార ధోరణితోనే జీలం నది నీళ్లను శనివారం వదిలిపెట్టిందని పాకిస్థాన్ ఆరోపించింది. ముందుగా సంబంధిత అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనితో వరదల ముప్పు తలెత్తిందని తెలిపారు.

పిఒకెలోని ప్రధాన నగరం ముజఫరాబాద్ పరిసర ప్రాంతాలలో నీటి మట్టం విపరీతంగా పెరిగింది. కాలువలు గట్టు తెంచుకుని ఉరుకుతున్నాయి. దీనితో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయని అక్కడి వారు తెలిపారు. పలుప్రాంతాలలో వాటర్ ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు వెలువరించారు. జీలం నది ఒడ్డునే ఉన్న హట్టియన్ ప్రాంతంలో పరిస్థితి దిగజారుతోంది. స్థానికులను అక్కడి మసీదుల మైక్‌ల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఎతైన ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని కోరుతున్నారు, దీనితో నది వెంబడి జనం ఉరుకులు పరుగులు , గందరగోళం నెలకొంది.కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ వద్దకు చేరిన నీరు ఉధృత రూపంలో పిఒకెలోని ఛకోటి ప్రాంతాన్ని చుట్టుముట్టింది. తమ దేశంపై భారతదేశం అప్రకటిత జల యుద్ధానికి దిగిందని అక్కడి వారు వాపోతున్నారు. ఇది పూర్తిగా అంతర్జాతీయ కట్టుబాట్లకు విరుద్ధం. కుదుర్చుకున్న నదీ జలాల ఒప్పందాలను తీసి గట్టున పెట్టడమే అని విమర్శించారు.

పహల్గామ్‌లో దాదాపుగా 29 మందిని పాక్ ఉగ్రవాదులు మట్టుపెట్టారు. హిందువులా కాదా గుర్తించి తరువాత వారిపై నిర్థాక్షణ్యంగా కాల్పులు జరపడం భారతదేశంలో వెన్నులో చలి పుట్టించింది. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడి పాకిస్థాన్ భారతీయ పౌరులను బలి తీసుకుంది. ఇందుకు ఉగ్రవాదులను వాడుకుందని భారత ప్రభుత్వం మండిపడింది. ఇక వరుసక్రమంలో పాకిస్థాన్‌పై పలు రకాలుగా దాడులు సాగుతాయని, త్వరలోనే అతి భారీ సైనిక చర్య ఉంటుందని కూడా పరోక్ష హెచ్చరికలు వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News