Monday, April 28, 2025

హర్షణీయంప్రపంచ అనువాద సాహిత్యం

- Advertisement -
- Advertisement -

మీ పాడ్‌కాస్ట్ హర్షణీయం ఎప్పుడు ప్రారంభిం చారు? ప్రపంచ సాహిత్యాన్ని కూడా మీరు తెలుగు పాఠకులకి పరిచయం చేస్తున్నారు కదా! ఆ వివరాలు చెప్తారా? 2000 సంవత్సరం మార్చి నెలలో మొదలైన హర్షణీయం ఆడియో పాడ్కాస్ట్ ఇటీవలే ఐదేళ్ళు పూర్తిచేసుకుంది. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పనిచేసే ముగ్గురు చిన్ననాటి మిత్రులం హర్ష, గిరి, అనిల్ కలిసి దీన్ని ప్రారంభించాము. మొదట్లో హర్ష రాసిన చిన్ని కథల ఆడియోతో ప్రారంభమైన ఈ పాడ్కాస్ట్, మొదటి మూడేళ్ళలోనే అరవై ఉత్తమ తెలుగు కథలను, యాభైమంది తెలుగు రచయితల ను, దేశవ్యాప్తంగా ముప్ఫయికి పైగా పర్యావరణం మీద పనిచేసే కార్యకర్తలను తెలుగు, ఇంగ్లీష్‌లలో ఇంటర్వ్యూలు చేసి పరిచయం చేసింది. గత రెండే ళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఫ్రెంచి, ఇటాలియన్, రష్యన్, నార్వేజియన్ తదితర ప్రపంచ భాషల నించి ఇంగ్లీషులోకి అనువదించే వందకు పైగా అనువాదకులను పరిచయం చేసింది. ప్రస్తుతం 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌కు ఎంపికైన పదమూడు నవలలపై బుకర్ సంస్థ సహకారంతో అనువాదకులను ఇంటర్వ్యూలు చేస్తోంది. ఈ సిరీస్ మే మాసాంతంలో రిలీజ్ అవుతుంది.’

పాఠకుల పఠనాసక్తిలో మీరు గమనించిన మార్పులను గురించి ఏమైనా చెప్తారా? మీరు ఇటీవలి కాలంలో ప్రపంచ సాహిత్యం, వాటి అనువాదాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు కదా?ప్రపంచవ్యాప్తంగా అనువాదాలను ఆదరించే పాఠకుల్లో 60శాతం పైగా 40ఏళ్లకు తక్కువ వయసు ఉండేవారు ఉంటున్నారు. రానురానూ అనువాదాలకు ఆదరణ పెరుగుతోంది. ఆయా దేశ ప్రభుత్వా లు తమ సాహిత్యం వేరే ప్రపంచ భాషల్లోకి తీసుకవెళ్ళడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇతర ప్రపంచ భాషలలో ప్రచురణ కర్తలు ఒక పుస్తకాన్ని ఎంపిక చేయడం, అనువాదం చేయించడం, ప్రచురణకు సిద్ధం చేయడం అన్న క్రమం ఎలా జరుగుతుంది?మూల రచనల్లో ఎలాంటి పుస్తకాన్ని అనువదించి ప్రచురించాలి అనే విషయంలో పబ్లిషర్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదాహరణకి జర్మన్ భాష నుంచి ఒక పుస్తకం తటస్థపడితే ఆ పుస్తకాన్ని జర్మన్ తెలిసి సునిశితంగా చదవగలిగిన పాఠకుల ను ఎంచుకుని, వారికి ఆ పుస్తకం పంపించి రీడర్ రిపోర్టులు తయారు చేయించి ఆ పుస్తకాన్ని ప్రచురించాలా? లేదా? అని నిర్ణయం తీసుకుంటారు. అనువాదకులను ఎంపిక చేసుకునేటప్పుడు నలభై, యాభై పేజీల శాంపిల్ అనువాదం ముందుగా చదవడం తప్పనిసరి. రచయితలు తమ రచనలను ఖర్చుపెట్టో మొహమాటపెట్టో అనువాదం చేయిం చే పుస్తకాలకు పెద్దగా విలువ ఉండదు.

అనువాదం ఒక కళా ప్రక్రియ అన్నారు మీరు.. కొంచెం వివరిస్తారా?రచనలాగే అనువాదం కూడా ఒక కళాప్రక్రియ. మానవ నాగరికతను, ఆలోచనా విధానాన్ని ఎంతో ప్రభావితం చేశాయి అనువాదాలు. ఈ మధ్యనే ప్రచురితమైన ‘గోల్డెన్ గేట్’ అనే పుస్తకంలో రచయి త విలియం డారిలింపుల్, భారత దేశంలో పుట్టిన బౌద్ధ మతం, చైనాకు ఎలా వ్యాపించిందో వివరిస్తూ, బౌద్ధ గ్రంథాలను చైనీస్ భాషలోకి అనువదించడానికి చైనా చక్రవర్తి పూనుకుని దాదాపు ఇరవై ఏళ్లు అనేక అనువాదకులను మన దేశం నుండి తీసుకెళ్లి అనువాదాన్ని ఒక యజ్ఞంలా ఎలా నిర్వహించాడో చెప్తాడు. నార్వేజియన్ రచయిత యాన్ ఫోసాలాంటి ఎనిమిది నోబెల్ గ్రహీతల నవలలను ఇంగ్లీషులోకి అనువదించిన సుప్రసిద్ధ అనువాదకుడు డేమియన్ సిరల్స్ తను రాసిన ‘ద ఫిలాసఫీ ఆఫ్ ట్రాన్స్లేషన్’ అనే పుస్తకంలో అనువాద ప్రక్రియ గురించి సోదాహరణంగా ఎన్నో వివరాలు ఇస్తాడు. సిరల్స్ ప్రకారం రచన అనేది ఒక వ్యక్తి ఊహలో మొదలై రాతలోకి రూపాంతరం చెందితే, అనువాదకుడు తాను చదివినదాన్ని ఆకళింపు చేసుకుని వేరే భాషలో మూల రచయిత రాస్తే ఎలా ఉంటుందో సృజించి రాతలోకి మారుస్తాడు.

అనువాదం అనేది ఒక భాషలోని పదాలను వేరే భాషలోని పదాలలో మార్పిడి చేయడం కాదు. పాత్రల తీరును జాతీయాలను, హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, గొప్ప రచయితల శైలిని అర్థం, పఠనానుభూతి చెడకుండా వేరే భాషలోకి అక్షర రూపంలోకి తీసుకరావడం ఒక గొప్ప సృజనాత్మకమైన ప్రక్రియ.ఇతర భాషల నుండి అనువాదం చేయడం ఒక ఎత్తైతే, దానిని నేరుగా ప్రచురణ కోసం పంప కుండా అనేక దశలలో క్షుణ్ణంగా వాటిని ఎడి టింగ్ చేయాలి కదా.. మన వద్ద అంత సీరియస్ ప్రక్రియ జరగడం లేదనిపిస్తుంది. ఇతర దేశాల పబ్లిషింగ్ సంస్థలు ఈ విషయంలో ఎలాంటి పద్ధతి అనుసరిస్తున్నారు?
అమెరికా, ఇంగ్లాండ్‌లో ప్రచురితమయ్యే పుస్తకాల అనువాదకులు తాము చేసిన అనువాదాన్ని కనీసం అయిదారు సార్లు పూర్తి స్థాయిలో ఎడిటింగ్ చేయందే పబ్లిషర్‌కు పంపించరు. ఆ తరువాత మూడు దశల్లో ఎడిటింగ్ జరుగుతుంది. ఉదాహరణకు నార్వేజియన్ భాషనుంచి ఇంగ్లీష్‌లోకి అనువదిస్తూ ఉంటే, ఈ రెండు భాషలు తెలిసిన ఎడిటర్ అనువాదాన్ని మూలానికి సరిపోలుస్తాడు. తన సలహాలను అనువాదకుడికి తెలియచేస్తాడు.

రెండో దశలో ప్రూఫ్ రీడింగ్ జరిగి మళ్ళీ అనువాదకుడి దగ్గరకు పుస్తకం వెళ్తుంది. మూడో దశలో పుస్తకా న్ని కేవలం ఇంగ్లీష్‌లో రాసిన పుస్తకంగా పరిగణించి, నేరుగా ఇంగ్లీష్‌లో రాసిన పుస్తకంలా ఉందా? లేదా? అని సరిచూస్తారు. అంటే నార్వేజియన్ నవలను ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తే, నార్వేలో జరిగి న కథను ఒక రచయిత ఇంగ్లీష్‌లో రాసుంటే ఎలా ఉంటుందో, అలా ఉందా? లేదా? అనేది పరీక్షిస్తా రు. వాక్య నిర్మాణం కృతకంగా ఉండకుండా ఇంగ్లీష్ వాక్యం, ఇంగ్లీష్ వాక్యంలాగే ఉండటం ఇందులో ప్రధానం.తెలుగునాట అనువాద సాహిత్యం పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు?తెలుగులోకి వేరే భాషల సమకాలీన సాహిత్యాన్ని తీసుకరావడం అనేది ఈ మధ్యకాలంలో బాగా తక్కువైపోయింది. ఎప్పుడో ప్రచురించిన దశాబ్దాల కిందటి రష్యన్ సాహిత్యమే తెలుగులో ఇప్పుడు పాఠకులకు అందుతోంది. ఇప్పుడున్న ప్రచురణ సంస్థల్లో ‘మంచి పుస్తకం’ పిల్లల పుస్తకాలను, ఛాయా పబ్లికేషన్స్ వేరే దేశీయ భాషల్లోంచి కాల్పనిక సాహిత్యాన్ని కొంతమేరకు పాఠకులకు అందిస్తున్నాయి. తెలుగులోం చి ఇంగ్లీష్‌లోకి వెళుతున్న పుస్తకాలు అతి తక్కువ, వాటి అనువాద నాణ్యతను గురించి మాట్లాడుకోవటం దండగ. మన పొరుగు రాష్ట్రాలైన మలయాళం, తమిళం, కన్నడంలో ఎంతో మంది యువ అనువాదకులు

(తమ విద్యాభ్యాసం అంతా ఇంగ్లీష్ మీడియంలో జరిగినా) తమ మాతృభాషలోని సాహిత్యం మీద ఎంతో ప్రేమతో తమ అనువాద నాణ్యతను మెరుగు పరుచుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తూ, ఇంగ్లీష్‌లోకి తమ సాహిత్యాన్ని తీసుకెళ్తున్నారు. ఇంగ్లీ ష్ అనువాద నాణ్యతకు గీటు రాయి, ఆంగ్లంలోకి అనువాదమైన పుస్తకాలు ఇంగ్లాండ్, అమెరికాలోని ప్రచురణ సంస్థలు ఆయా పుస్తకాల ను ప్రచురించడం. వారి నాణ్యతా ప్ర మాణాలు చాలా గొప్పగా ఉంటాయి. గత కొద్దికాలంలో తమిళ రచయితలైన జయమోహన్, పెరుమాళ్ మురుగన్‌లు రాసిన పుస్తకాలు అనువాదకులు ఇంగ్లీష్‌లోకి అనువదిస్తే అవి అమెరికా, బ్రిటన్‌లలో పునర్ముద్రణకు నోచుకుని బుక ర్, ఆల్టా లాంటి ప్రసిద్ధ సంస్థలు ఇచ్చే బహుమతులకు జరిగే పోటీల్లో ఎంపిక కావటం చాలా సంతోషించదగ్గ విషయం. తెలుగు నాట కూ డా అనువాదాల పట్ల, అనువాద నాణ్యత, శిక్షణ పట్ల గౌరవం పెరగడమంటూ జరిగితే పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య తరిగిపోయిందనే భ్రమ నించి బయట పడే అవకాశం కొంతమేర పబ్లిషర్లకు లభించి తద్వారా గొప్ప మేలు పాఠకులకు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News