అచ్చమైన తెలుగుతనానికి ప్రతీక ఆయన ఆహార్యం. పల్లెవాటు పదాలకు ఆయన పరిశోధన ఓ ఆటపట్టు. ఆయన రచనలు జానపద సాహిత్య ప్రతిబింబాలు. జానపద సాహిత్య రారాజు అని ఆయనకు మరోపేరు. ఆయనే ఆచార్య బిరుదు రాజు రామరాజు. ఈ ఏడాది ఫిభ్రవరి 16వ తేదీన ఆయన శత జయంతి. జానపద సాహిత్యంపైన దక్షిణ భారతదేశంలోనే మొదటిగా పిహెచ్‌డి పట్టా పొందిన ఘనత రామరాజు గారిది. 1925 ఏప్రిల్ 16వ తేదీన హనుమకొండ జిల్లా దేవనూరు గ్రామంలో లక్ష్మీ దేవమ్మ, నారాయణ రాజు దంపతులకు జన్మించారు. పెంచి న వారు బిరుదు రాజు లలితమ్మ, రామరాజు. దేవునూరు వీధి బడిలో, మడికొండ ప్రైమరీ, హనుమకొండలో ఇంటర్మీడియట్, 1949లో హైదరాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ, ఎంఎ ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1956లో పరిశోధన పట్టా అందుకున్నారు. 1966లో ఎంఎ సంస్కృతంలో పూర్తి చేశారు. సివిల్ సర్వీసులో ఉత్తీర్ణుడై పంచాయితీ అధికారిగా ఎన్నికయ్యారు.
సురవరం ప్రతాపరెడ్డి గారి సూచనల మేరకు ఉద్యోగంలో చేరకుండా జానపద సాహిత్యంపై పరిశోధనలు చేశారు. ‘జానపద గేయ సాహిత్యమున తొలుదొలుత నాకభినివేశము కలిగించిన వారు జానపదులే. మాయూరు పొలము నాటులప్పుడు, వరి కోతలప్పుడు, మోట తోలునప్పుడు, పిండి విసురునప్పుడు పల్లీయులు పాడినప్పుడును. తెల్లవారుజామున మా నాయనమ్మ గారు నన్ను ఒడిలో కూర్చుండబెట్టుకొని మేలుకొలుపులు పాడినప్పుడు నా చెవులగింగురుమన్న పాటలు, మాట లు నన్ను అధికంగా ఆకర్షించినవని ఆయన స్వయంగా రాసుకున్నారు. అచ్చమైన పల్లె సంస్కృతికి, ప్రజా జీవనానికి జానపదం మూలమని ఆయన భావన. పరిశోధనా సమయంలో ఆయన పడినన్ని ఇక్కట్లు బహుశా మరే ఇతర పరిశోధకులు పడి ఉండరు. రవాణా సౌకర్యాలు అంతగా లేని ఆ రోజులలో కాలినడకన మైళ్ళ కొద్దీ నడిచేవారు. మారుమూల పల్లెలకు వెళ్లి గ్రామీణులను కలుసుకొని, వారి పాటలు వింటూ రాసుకొనేవారు.
శ్రమపడి ఎన్నో ప్రాం తాలు తిరిగి, మరుగునపడిన పాటలను సేకరించి, పరిశీలించి, అధ్యయనం చేసి పరిశోధించి వాటికి సమగ్రరూపాన్ని ఇచ్చిన విరించి- బిరుదు రాజు రామరాజు. ఆ జానపద సాహిత్య విజ్ఞాన పరిశోధనలో ఆయన చూపి న మార్గం ఎందరికో అనుసరణీయం. మరెందరికో పరిశోధనాంశం అయింది.
ఆచార్య బిరుదురాజు రామరాజు స్వాతంత్య్రోద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారు. మెట్రిక్ చదివే రోజులలో పదకొండవ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మాగాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. స్టేట్ కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొని 1947లో జైలుశిక్ష అనుభవించారు. కాళోజీ, హయ గ్రీవాచారి, ముదిగొండ సిద్ధ రాజలింగం, జమలాపురం కేశవరావు తదితరులతో కలిసి రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1947-50 మధ్య కాలం నిజాం కళాశాలలో తెలంగాణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. స్నాతకోత్తర విద్యార్థిగా ఉన్న సమయంలో సి.నారాయణరెడ్డి గారితో కలసి కొంతకాలం రామనారాయణ కవులనే పేరుతో జంట కవులుగా కవిత్వం రాశారు. మాడపాటి హనుమంతరావు స్థాపించిన ఆంధ్ర సంఘానికి అధ్యక్షుడిగా చేశారు. తెలంగాణా రచయిత సంఘం మొదటి కార్యదర్శి బిరుదు రాజు రామరాజు గారు.
ఆచార్య బిరుదురాజు రామరాజు 1951లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా చేరారు. 1957-నుంచి 1973ల మధ్య అంచెలంచెలుగా ఎదిగి తెలుగు శాఖ డీన్‌గా వ్యవహరించారు. 1967-1974ల మధ్య వరంగల్ స్నాతకోత్తర కేంద్రంలో పనిచేశారు. ఈయన మార్గదర్శకత్వంలో 37 మంది పరిశోధనా పట్టాలందుకున్నారు. కేతవరపు రామకోటి శాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్రశాస్త్రి, అక్కిరాజు రమాపతిరావు, అనంతల, రవ్వా శ్రీహరి తదితర ప్రముఖులు ఈయన పర్యవేక్షణలో పట్టలందుకున్న వారే. 1983లో పదవీ విరమణ చేసారు బిరుదరాజు. ‘తెలుగు వీరుడు, వీరగాథలు, తెలుగు జానపద సాహిత్యము, మరుగునపడిన మాణిక్యాలు, ఉర్దూ, తెలుగు నిఘంటువు, ఆంధ్ర యోగులు (ఆరు సంపుటాలు) యక్షగాన వాఙ్మయము, తెలంగాణ పిల్లల పాటలు, తెలంగాణా పల్లెపాటలు, తెలుగు జానపద రామాయణం వంటి పెక్కు రచనలు చేశారు.
1953లో ఒక పూజారిని ఆయన కలిసిన తరువాత, తాళపత్ర గ్రంథాల యొక్క దీనస్థితిని చూసి చలించిపోయి దేశ వ్యాప్తంగా పర్యటించి వాటిని పరిశోధించి సేకరించాలనుకున్నారు. ఇందుకో సం సంస్కృతం ఎంఎ చేశారు. శరత్ చంద్ర, ప్రేమ్ చంద్‌లను తెలుగులోనికి అనువదించారు. ఆచార్య బిరుదురాజు రామరాజు గారికి ఎన్నెన్నో పురస్కారాలు లభించాయి. 1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. 2006-2007 విశిష్ట పురస్కారంను అందించింది. 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ఫ్రొఫెషనల్ షిప్ అందుకున్నారు. 2003లో రాజాలక్ష్మి, 2009లో సి.పి బ్రౌన్ అకాడమీ ‘తెలుగు భారతి’ పురస్కారం స్వీకరించారు. అత్యుత్తమ స్థాయి కీర్తి పొందిన భారతీయ రచయిత, జాతీయవాది. బహుబాషా కోవిదులు. తెలుగు జానపద అధ్యయన ‘బైబిల్’గా ఖ్యాతినొందిన ‘తెలుగు జానపద గేయ సాహిత్య’ గ్రంథకర్త ఆచార్య బిరుదు రాజు రామరాజు గారు ఫిబ్రవరి 8, 2010లో మరణించారు. ఆయన రచనలు.. చిరః యశోచంద్రికలు.