Monday, April 28, 2025

ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. సంచులు నింపుడు.. మోయడంలోనే కాంగ్రెస్ పాస్ అయ్యిందంటూ మండిపడ్డారు. ఈ సర్కార్ సంక్షేమం, మంచినీళ్లు, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో ఫెయిలైందని విమర్శించారు. కరెంట్ సరఫరాలో రైతు బంధు, విత్తన సరఫరా, ధాన్యం కొనుగోళ్లలో పెయిల్ అయ్యిందని, భూముల ధరలు పెంచడంలోనూ ఫెయిలైందని ధ్వజమెత్తారు.దేవుళ్ల మీద ఓట్లు, అబద్దపు వాగ్ధానాలు చేయడం, ప్రతి పనిలో కమీషన్లు తీసుకోవడం, 20- 30 శాతం కమీషన్లు తీసుకునుడు.. సంచులు నింపుడు.. సంచులు మోసుడు అంతేనా..ఈ మాట కరెక్టేనా..? అని సభలో ఉన్నవాళ్లను అడిగారు. సంచులు నింపడం, మోయడంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ సక్సెస్ అయ్యిందని అన్నారు. అన్నింట్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా..

అంటే.. ఫెయిల్ అంటూ పార్టీ శ్రేణులు నినదించారు. 20 -30 శాతం కమీషన్ల మాట తాను అనడం లేదని, స్వయంగా ఆర్థికశాఖ మంత్రి చాంబర్‌కు 200 మంది కాంట్రాక్టర్లు పోయి గొడవ చేశారని తెలిపారు. తమను 20 -30శాతం కమీషన్లు అడుగుతున్నరు. ఇదేం అన్యాయం అని చెప్పి కాంట్రాక్టర్లు అడిగిన మాటనే తాను చెబుతున్నానని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ఏర్పాటై 24 వసంతాలు పూర్తయి 25 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, బిఆర్‌ఎస్ అగ్రనేతలు హరీష్‌రావు, కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి
మాజీ సర్పంచులు పని చేశాం బిల్లులు ఇవ్వమంటే వాళ్లను గోసపుచ్చుకుంటున్నారని, వాళ్లేం పాపం చేశారు..? అని కెసిఆర్ ప్రశ్నించారు. తనను అసెంబ్లీకి రావాలని అంటున్నారని, దేనికి రావాలి… మీ కాయకారుడు ముచ్చట్లు వినడానికా..? అని అధికార పార్టీని ప్రశ్నించారు. పిల్లలు అడిగితే సిఎం, డిప్యూటీ సిఎం జవాబు చెప్పలేకపోతున్నాడని దుయ్యబట్టారు. 2030 శాతం కమీషన్ అని కెటిఆర్ ఉన్నది ఉన్నట్లు అడిగితే ఆర్థికమంత్రి అసెంబ్లీలో నిలబడి.. భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. డిప్యూటీ సిఎం కమీషన్ తీసుకుంటెనే ఆయనకు బాధ ఉండాలి కదా.. ఈ మాట అన్నందుకు ఆయన అసెంబ్లీలో లేచి పెద్ద లొల్లి పెడుతున్నారని మండిపడ్డారు. చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో అడ్డగోలు మాటలు చెప్పారని, దాంతో ప్రజలు కూడా గోల్‌మాల్ అయిపోయామని చెప్పారు.

తీర్థం పోదాం తిమ్మక్క అంటే.. వాళ్లు గుళ్లే.. మనం సల్లే అన్నట్లుగా ఇవాళ ప్రజలను ఆ గతికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గాడిదలకు గడ్డేసి.. బర్లకు పాలు పిండితే వస్తయా..? అని అడిగారు. హైదరాబాద్ ఇళ్లు కూలగొడితే కెసిఆర్ అన్న యాడున్నవ్..నువ్వు రావాలి అని ఓ తమ్ముడు అన్నారని, కత్తి వాళ్ల చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమనవడితివి అని ఆయనను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. పోగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలని, ప్రజల వెంట బిఆర్‌ఎస్ పార్టీ ఉంటది..కెసిఆర్ ఉంటడు అని భరోసా ఇచ్చారు. వందశాతం మళ్లీ తెలంగాణలో విజయం సాధించాలి.. గులాబీ జెండా ఎగురవేయాలి.. అద్భుతమైన తెలంగాణను సాధించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే
ఆనాడైనా..ఈనాడైనా..ఏనాడైనా తెలంగాణ రాష్ట్రానికి విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్‌లాల్ నెహ్రూ అయితే, 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా అణచివేసిందని విమర్శించారు. వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్న తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ఒక్కడినే బయల్దేరానని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం బయల్దేరిన సమయంలో కొందరు వెటకారం చేశారని, అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించానని చెప్పారు. ప్రజలు దీవిస్తే పదేళ్లపాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేసుకున్నామని వ్యాఖ్యానించారు. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి మళ్లీ జీవం పోశానని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టిఆర్‌ఎస్ ఆవిర్భావం జరిగిందని, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని ఆనాడు చెప్పానని గుర్తు చేశారు.

ఆపరేషన్ కగార్ ఆపేయాలి
ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుతానికి సూచించారు. మావోయిస్టులను ఏరిపారేస్తామనడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. మిలటరీబలంతో నక్సలైట్లను అంతమొందిస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని హితవు పలికారు. ఛత్తీస్‌ఘడ్‌లో నక్సలైట్లను సంపిందే సంపుతున్నరు అని, నక్సలైట్లేమో చర్చలకు పిలువాలని నెత్తీ నోరు కొట్టుకొని చెబుతున్నారని అన్నారు. పిలిస్తే ఏం పాయె.. కోసుకుంట పోవుడేనా..? అని ప్రశ్నించారు. మావోయిస్టులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

చర్చలు జరపాలన్న నక్సల్స్ వినతికి తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడించారు. బిజెపి కేంద్రంలో 11 ఏండ్లు రాజ్యమేలితే.. తెలంగాణకు 11 పైసలియ్యలేదని విమర్శించారు. తెలంగాణ అయిందని ప్రజలు సంతోష పడుతుంటే ప్రధానమంత్రేమో తల్లిని సంపిన్రు బిడ్డను బతికిచ్చారని పలుసార్లు అన్నారని మండిపడా ్డరు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఉల్టా 7 మండలాలు గుంజుకున్నారని చెప్పారు. సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నరు..ఒక్క ప్రాజెక్టుకన్నా జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు. రేకు డబ్బా ల రాళ్లేసి ఊపినట్టు.. బొబ్బ ఎక్కువ అని విమర్శించారు. శుష్క ప్రియా లు, శూన్య హస్తాలు…బభ్రాజ మానం భజ గోవిందం అంటూ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకు ఏం బీమారి వచ్చింది..?
ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణకు ఇప్పుడు ఏం బీమారి వచ్చిందని కెసిఆర్ సభకు వచ్చినవాళ్లను అడిగారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పారని, ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు ఎన్నో హామీలిచ్చారని అన్నారు. పింఛను రూ.2 వేలు ఉంటే కాంగ్రెసోళ్లు రూ.4 వేలు వేస్తామన్నారని, రైతుబంధు రూ.10 వేలు ఇస్తే.. రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారని గుర్తు చేశారు.విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీని ఒక్క సంతకంతో రద్దు చేస్తామని చెప్పి చేయలేకపోయారన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు…ఇప్పటికీ పింఛన్లు పెరగలేదు… రుణమాఫీ పూర్తి కాలేదని మండిపడ్డారు.

ఉచిత బస్సులు పెట్టి మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి తెచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న ఒకే కలంపోటుతో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి, ఇంతవరకు అమలు చేయలేదని దుయ్యబట్టారు. వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. తమ బిఆర్‌ఎస్ ప్రభుత్వం నష్టం వచ్చినా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వడంలో విఫలమైందని అన్నారు. కల్యాణలక్ష్మి కింద తాము ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అదనంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఆ హామీ ఏమైందని నిలదీశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు 420 హామీలు ఇచ్చారని, సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని, కానీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఇలా అయిపోతుంటే దుఃఖం వస్తోంది
తన కళ్లముందే తెలంగాణ ఇలా అయిపోతుంటే దుఃఖం వస్తోందని కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ కరెంట్ కోతలు, మోటార్లు కాలిపోయే రోజులు వచ్చాయని, కెసిఆర్ మంచిగా ఇచ్చిన కరెంట్‌కు ఇవాళ ఏమయిందని అడిగారు. భూముల ధరలు ఎందుకు తగ్గాయి, నీళ్లు ఎక్కడికి పోయాయని కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వడ్లు కొనే దిక్కు లేదు, కల్లాల్లో రైతులు ఏడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు వేసుకున్న గుడిసెలను హైడ్రా పేరుతో కూల్చుతున్నారని, ఆనాడు చెరువుల్లో పూడికలు తీసిన బుల్డోజర్లు ఇప్పుడు ఇళ్లను కూలుస్తున్నాయని అన్నారు. ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారని మండిపడ్డారు.

ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇవ్వాలని బయటకు రాలేదు
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు బయటకు రాలేదని కెసిఆర్ చెప్పారు. ఇన్నాళ్లు చూశాను, ఏడాదిన్నర పూర్తయ్యింది ఇంకెప్పుడు హామీలు అమలు చేస్తారని అడిగారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి తెలివితో పని చేయాలని కోరారు. ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్లీ అక్కడే సాధించుకోవాలని పేర్కొన్నారు. మాట్లాడితే బిఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు అమ్మొచ్చు.. అభివృద్ధి చేయొచ్చు కానీ యూనివర్సిటీ బూములు అమ్ముతారా..? అని ప్రశ్నించారు. ఎవరైనా వాటిని ఆపుతారా..? అని అడిగారు. ఇవాళ హైదరాబాద్ యూనివర్శిటీ రేపు ఉస్మానియా యూనివర్శిటీ అమ్మేస్తారని అన్నారు. కెసిఆర్ కిట్స్‌ను ఎందుకు బంద్ చేశారని ప్రశ్నించారు.ఇప్పటి నుంచి తానూ బయటికి వస్తానని, అందరి తరఫున పోరాడుతానని కెసిఆర్ స్పష్టంగా చెప్పారు.

మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే
వైఎస్‌ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నేను రద్దు చేయలేదని కెసిఆర్ అన్నారు. ఎవరు తెచ్చినా బాగున్న పథకాన్ని కొనసాగించాలని చెప్పానని గుర్తు చేశారు. పేరు కూడా మార్చకుండా ఆరోగ్య శ్రీ పథకాన్ని కొనసాగించామని తెలిపారు. బిఆర్‌ఎస్ సభ పెట్టుకుంటే ఆటంకాలు సృష్టించారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బిఆర్‌ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో బిఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్లు ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే వారిపై పోలీసు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రజలపై కేసులు పెడుతున్న పోలీసులు గుర్తించుకోవాలని చెప్పారు. దానిని ఆపటం ఎవరితరం కాదని హెచ్చరించారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు.. మీ డ్యూటీ మీరు చేయండి అంటూ కెసిఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని కెసిఆర్ ధ్వజమెత్తారు. మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట.. అని విమర్శించారు. మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా..? అని అడిగారు.

కార్యకర్తలపై కెసిఆర్ చిరాకు
బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభలో అధినేత కెసిఆర్ ఆ పార్టీ కార్యకర్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రసంగిస్తున్న సమయంలో సిఎం సిఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో వారిపై ఆయన చిరాకు పడ్డారు. బుద్ది ఉందా…లేదా అంటూ వారిపై విరుచుకుపడ్డారు. గమ్మున ఉండాలంటూ కార్యకర్తలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News