మా పాలనపై చర్చకు సిద్ధమా?
తేదీ మీరే చెప్పండి.. అసెంబ్లీ
వేదికగా మాట్లాడుదాం
తెలంగాణ ఇచ్చినందుకు
కాంగ్రెస్ విలనా?
అధికారం కోసం కెసిఆర్ పగటి
కలలు: మంత్రి పొంగులేటి
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం ద్రశేఖర్‌రావు అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమా అని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. తేదీని మీరే ఖరారు చేయాలని, తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. మీరు అన్నట్లు మీ బచ్చాగాళ్లతో కాకుండా మీరే స్వయంగా అసెంబ్లీకి వస్తే మీ పాలనలో మీరు చేసిన ఘనకార్యాలు చెబుతామని అన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బిఆర్‌ఎస్ సభలో ప్రతిపక్ష నేత కెసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహచర మంత్రు లు సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పెద్ద విలన్ లా చూపిస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మా ట్లాడారని, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా..? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా కాళ్లు మొక్కిన విషయం అప్పడే మర్చిపోయావా కేసీఆర్ అని అన్నారు.
రెండుసార్లు అధికారం ఇస్తే బీఆర్ ఎస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసని, కేసీఆర్ అనుభవంతో సలహాలు ఇస్తారనుకుంటే అసెంబ్లీకి రాకుండా పోయారని అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడైన సెక్రటేరియట్ కు వచ్చారా..? ఫాంహౌజ్ నుంచి దొరలపాలన నడిపారు.. ఏనాడైనా ప్రజాస్వామ్య పద్దతిలో పాలనా చేశారా ? అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కాంగ్రెస్ పై విషం చిమ్మారని పొంగులేటి మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు బాకీలు పెట్టిందే బీఆర్ ఎస్ ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు 80వేల కోట్లు పెండింగ్ పెట్టారని అన్నారు. సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా మోసం చేసింది బీఆర్ ఎస్ అన్నారు.
అధికారం కోసం పగటి కలలు కంటున్నారు : అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఆనాడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ వస్తే బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్భంధించలేదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని తాము కోరితే మీరు తిరస్కరించలేదా అని అన్నారు. ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం ఉందని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియాగాంధీని దేవత అంటూ మీ కుటుంబం అంతా సోనియాగాంధీకి సాష్టాంగ నమస్కారం చేసిన విషయం మర్చిపోయి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మడం బాధగా అనిపించిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఆవేదన చెందుతున్నట్లు కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే నవ్వు కూడా వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ను నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారని, దానికి నిదర్శనం సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ అపార అనుభవం, 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో మంచి సలహాలు ఇస్తారనుకుంటే 15 నెలల్లో కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని అన్నారు. ప్రజలను పట్టించుకోకుండా ఫాంహౌజ్ కే పరిమితమైన మీ పాలనకు తానే ప్రత్యక్ష సాక్ష్యం అని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిత్యం ప్రజల్లో ఉంటూ అందిస్తున్న పాలనను ఓర్వలేక మనసంతా విషాన్ని నింపుకొని ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తిపోశారని దుయ్యబట్టారు.
ఆనాడు వరి వేస్తే ఉరే అని అనలేదా : కేసీఆర్ రైతులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని, ఆనాడు వరి వేస్తే ఉరే అని ప్రజలకు చెప్పి, ఆయన ఫాంహౌజ్ లో 150 ఎకరాల్లో వరి వేసుకున్నారని విమర్శించారు. ఆయన పంట క్వింటాల్ రూ.4 వేలకు అమ్ముకుని, రైతులను పస్తులుంచి పరోక్షంగా ఉరి వేసుకొమ్మని చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని చెబుతున్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.80 వేల కోట్ల బిల్లులను చెల్లించకుండా ఇందిరమ్మ ప్రభుత్వం భారం వేసి వెళ్లిపోయారని తెలిపారు. అలాగే సర్పంచుల ఆందోళనల గురించి మాట్లాడారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఒక్క సర్పంచ్ కూడా అధికారంలో లేడని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క సర్పంచ్ కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని తెలిపారు. పెండింగ్ బిల్లులతో సర్పంచులు ఇబ్బంది పడుతున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వ పుణ్యమేనని మంత్రి వెల్లడించారు.
పార్టీకి రూ.15 వందల కోట్లు ఎలా వచ్చాయి : కేసీఆర్ ను రెండు ప్రశ్నలు అడుగుతామని, ఉద్యమ పార్టీగా మొదలై ప్రాంతీయ పార్టీగా అవతరించి, జాతీయ పార్టీ మీరు సర్టిఫికేట్ ఇచ్చుకున్న బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోకి ఏ జాతీయ పార్టీకి లేనంతా డబ్బు రూ.15 వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏం వ్యాపారం చేశారని మీ కుటుంబసభ్యులకు వేలాది కోట్లు ఆస్తులు వచ్చాయని నిలదీశారు. గురిగింజ కింద నలుపు గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ మీద గుడ్డ కాల్చి వేయడం భావ్యం కాదని, శరీరమంతా విషాన్ని నింపుకొని మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు. సభకు అడ్డంకులు సృష్టించారని అంటున్నారని, ఆనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ సభకు వాహానాలకు పర్మిషన్ ఇవ్వలేదన్న సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క బస్సులకే కాదని, అన్ని వాహనాలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. డైరీలో రాసుకొండి అని పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేసి మొగుడు పెళ్లాలు.. అన్నదమ్ముల మాటలు విన్న మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కుందా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీఆర్‌ఎస్ పథకం ఒక్కటైనా రద్దయ్యిందా చెప్పాలని పొంగులేటి నిలదీశారు.
అధికారం కోల్పోయిన బాధ కనిపించింది : మంత్రి సీతక్క
ఒక నియంత అధికారని కోల్పోయి మాట్లాడినట్లు కేసీఆర్ ప్రసంగం ఉందని మంత్రి సీతక్క అన్నారు. వారి కుటుంబంలో చీలికలు, పేలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్‌లో కనిపించిందన్నారు. పది నెలల్లో 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని, మరి మీహయాంలో మీరెంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కెసిఆర్ బిడ్డ మంచి మంచి కార్లలో తిరుగుతుంది..మా పేద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో తిరగకూడదా? అని నిలదీశారు. కెసిఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరు వాడుకోలేదని, రూ. 60 వేల కోట్ల కరెంట్ బిల్లుల బకాయిలను పెట్టి వెళ్లిపోయారన్నారు. ధర్నా చౌకులలో కెసిఆర్ ధర్నాలు కూడా చేయనివ్వలేదని, కెసిఆర్ సభ దగ్గర రైతుల కాలువలను పూడ్చి సభ నిర్వహించారన్నారు. అసెంబ్లీని సొల్లు కబురు అని కెసిఆర్ అసెంబ్లీని అవమానించారని, మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసిఆర్ కు ఉందా? అని అన్నారు. అసెంబ్లీ సొల్లు కబురు అయితే కొడుకు, అల్లుడ్ని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారన్నారు.
చదివేస్తే ఉన్న మతి పోయినట్లుగా ఉంది : మంత్రి జూపల్లి కృష్ణారావు
యూనివర్సిటీని అమ్మేశారని కెసిఆర్ అంటున్నారని, 20 సంవత్సరాల క్రితం ప్రైవేటు వ్యక్తికి అప్పగిస్తే మీరున్న పదేళ్లలో ఎందుకు దాని గురించి మాట్లాడలేదని జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. చదివేస్తే ఉన్న మతి పోయినట్లు బంగారు బాతుగుడ్డులాంటి ఓఆర్‌ఆర్‌ను మీకు సంబంధించిన వారికి రూ.7వేల కోట్లకు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. ఏకఛత్రాధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మీది పారదర్శక పాలన అయితే ఉద్యమ పార్టీకి రూ.500 కోట్ల నిధులు ఎలా వచ్చాయన్నారు. రజతోత్సవ సఢకు ఒక్కొక్క గ్రామంలో సుమారు రూ.3 నుంచి రూ.4లక్షల వరకు ఖర్చు చేశారన్నారు. ఒక్క ఇరిగేషన్ ఉద్యోగి వద్దనే ఎసిబి సోదాల్లో రూ.100 కోట్లు దొరికితే మీ పాలనలో ఎన్ని కోట్ల అవినీతి జరిగింతో ప్రజలకు అర్థమవుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కెసిఆర్‌కు లేదన్నారు. గొప్ప రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రగతి భవన్‌కు వెళ్లాలన్నా..ఫామ్‌హౌస్‌కు వెళ్లాలన్నా ఎన్ని ఇబ్బందులో పెట్టారో గుర్తు లేదా ? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలగి పరివర్తన రావాలని అన్నారు.
విలన్ అన్న మాటలు ఉప సంహరించుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
ఏరు దాటాక బోడ మల్లన్న చందంగా కెసిఆర్ మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సోనియాగాంధీ దేవత అన్న నోటితోనే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అని వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ అనలేదనా అని నిలదీశారు. కెసిఆర్ అవకాశవాదిగా మాట్లాడారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను విలన్ అన్న మాటలు ఉపసంహరించుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళులు ఎందుకు అర్పించలేదని కెసిఆర్‌ను నిలదీశారు.