న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తానీయులను భారత్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడికి పాల్పడిన వారికోసం భారత ఆర్మీ కాశ్మీరను జల్లెడపడుతోంది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను ధ్వంసం చేశారు. తాజాగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సహా పలువురు పాకిస్థానీయుల ఛానళ్లపై నిషేధం విధించింది.
రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుడు కథనాలను వ్యాప్తి చేసినందుకు 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 3.5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లతో కొనసాగుతున్న షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిషేధించారు. దాదాపు 63 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న నిషేధిత ప్లాట్‌ఫామ్‌లలో డాన్ న్యూస్, సమా టీవీ, ARY న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, జియో న్యూస్, సునో న్యూస్ వంటి ప్రధాన పాకిస్తానీ వార్తా ఛానెల్‌లు ఉన్నాయి. ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూక్ వంటి జర్నలిస్టులు నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ తోపాటు ది పాకిస్తాన్ రిఫరెన్స్, సమా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్, రజి నామా వంటి ఇతర ఛానెల్స్ ను నిషేధించారు.