పహల్గామ్ దాడిపై అఖిల పక్ష భేటీకి మోడీ గైర్‌హాజరుకు ఆక్షేపణ
దేశ గౌరవానికి హాని సమయంలో బీహార్‌లో మోడీ ఎన్నికల ప్రసంగం
ఆయన తమ నుంచి ఏ సహాయం కోరుతున్నారు?
జైపూర్ : 26 మంది ప్రజలను బలిగొన్న పహల్గామ్ ఉగ్ర దాడిపై చర్చించేందుకు ఏర్పాటైన అఖిల పక్ష సమావేశానికి హాజరు కానందుకు ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తూర్పారపట్టారు. జైపూర్‌లో ‘సంవిధాన్ బచావో’ ర్యాలీలో ఖర్గే ప్రసంగిస్తూ, ‘దేశ గౌరవానికి హాని కలిగినప్పుడు మీరు (ప్రధాని మోడీ) బీహార్‌లో ఎన్నికల ఉపన్యాసం ఇస్తుండడం దేశం దురదృష్టం’ అని అన్నారు. ‘అన్ని పార్టీల నేతలు అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యారు. కానీ ప్రధాని మోడీ ఆ సమావేశానికి రాకపోవడం శోచనీయం. బీహార్‌ఏమైనా దూరంగా ఉన్నదా? ప్రధాని అఖిల పక్ష సమావేశానికి వచ్చి, ప్రభుత్వ ప్రణాళికను వివరించి ఉండవలసింది.
ఆయనకు మా నుంచి కావలసిన సహాయం ఏమిటి?’ అని ఖర్గే పేర్కొన్నారు. ప్రధానిపై మరింతగా ఖర్గే విరుచుకుపడుతూ, ‘మోడీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత ఇచ్చారు. అటువంటి వ్యక్తులు దేశాన్ని బలహీనపరుస్తారు. 56 అంగుళాల ఛాతీ కుంచించుకుపోయింది’ అని విమర్శించారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో ఉత్తర ప్రదేశ్‌ను గుజరాత్‌గా మార్చడానికి 56 అంగుళాల ఛాతీ కావాలని అన్న సంగతి విదితమే. దేశమే సర్వోన్నతం కనుక ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా తాము మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించినట్లు ఖర్గే తెలియజేశారు. ‘దేశం సర్వోన్నతం, ఆ తరువాతే పార్టీలు, మతం వస్తాయి.
దేశం కోసం అంతా సమైక్యం కావాలి’ అని ఆయన పేర్కొన్నారు, కాంగ్రెస్ సమైక్యత గురించి మాట్లాడుతుంటే బిజెపి దానిని విడదీయడం గురించి మాట్లాడుతుంటుందని ఆయన ఆరోపించారు. ‘ఈ దేశంలో రాజ్యాంగం సుప్రీం. మన ప్రజాస్వామ్యం రాజ్యాంగం కింద నడుస్తుంటుంది’ అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకులపై దాడులపైన, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపైన ప్రభుత్వాన్ని ఖర్గే తీవ్రంగా విమర్శిస్తూ, ‘కాంగ్రెస్ వృద్ధి చెందుతున్నప్పుడల్లా ఈ వ్యక్తులు దానిని అణచివేయజూస్తుంటారు. మేము అణచివేతకు గురయ్యేవారం కాము’ అని అన్నారు. బిజెపి నేతలు ప్రతి ఒక్కరినీ బలహీనపరచజూస్తున్నారని, కానీ ప్రజలపై ‘తప్పుడు’ కేసులు బనాయించడం ద్వారా వారుప్రజాస్వామ్యాన్ని బలహీనపరచజాలరని ఖర్గే అన్నారు.