భారీ స్థాయి విద్యుత్ సంక్షోభంతో ఉన్నట్లుండి స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాలో అంధకారం నెలకొంది. సోమవారం నెలకొన్న ఈ పరిస్థితితో జనం విలవిలలాడాల్సి వచ్చింది. దేశ రాజధానులు మొదలుకుని మారుమూల ప్రాంతాల వరకూ విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో పలు సంస్థల్లో కార్యకలాపాలు నిలిచిపొయ్యాయి. సబ్ వేలు పనిచేయలేదు. ఇంటర్నెట్ నిలిచిపోయింది. ఎటిఎం యంత్రాలు చతికిలపడ్డాయి. ఎక్కడా లైట్లు వెలుగని స్థితిలో జనం చీకట్లో గడపాల్సి వచ్చింది. వాతావరణ ప్రతికూలత కూడా ప్రజలకు ఇబ్బంది కల్గించింది. యూరోపియన్ గ్రిడ్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో ఈ ఐరోపా దేశాలలో ఈ అత్యవసర పరిస్థితి నెలకొంది. అంతటా బ్లాకౌట్ వాతావరణం నెలకొంది. అరాచక మూకలు రెచ్చిపోయేందుకు వీలేర్పడింది. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ సంక్షోభం తలెత్తిందని స్థానికులు తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నత స్థాయి సాంకేతిక బృందాలు రంగంలోకి దిగాయి.స్పానిష్ జనరేటర్ రెడ్ ఎలక్ట్రికా సంస్థ పరిస్థితిని సమీక్షిస్తోంది. ఐబెరియన్ సింధుశాఖలోకి వచ్చే ఈ రెండు దేశాలు ఇప్పుడు కనివిని ఎరుగని రీతిలో కడగండ్లకు గురి అవుతున్నాయి.
ఈ రెండు దేశాల్లో కలిపి దాదాపుగా 5 కోట్ల వరకూ జనాభా ఉంది. ఏ సంఖ్యలో జనం కరెంట్ కష్టాలకు గురి అయ్యారనేది తేలాల్సి ఉంది. స్పెయిన్ పార్లమెంట్ సమావేశాలను విద్యుత్ సరఫరా లేకపోవడంతో నిలిపివేశారు. ఇక మీడియా సంస్థలు ఎటువంటి కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. రెండు దేశాలలో జరగాల్సిన క్రికెట్ షోలు, ఇతర ప్రదర్శనలు నిలిచిపొయ్యాయి, పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాలో చీకట్లు కమ్ముకున్నాయి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలతోనే విద్యుత్ సంక్షోభం నెలకొందని ప్రాధమికంగా తెలిసింది. ఒకేసారి దేశాలు విద్యుత్ సమస్యలతో సతమతమవుతూ ఉండటం ఇటీవలి కాలంలో అసాధారణ విషయం అయింది. కాగా ప్రధాన విద్యుత్ సంస్థ సోమవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువరించింది. దశలవారిగా విద్యుత్ పునరుద్ధరణ జరుగుతోందని , 6 నుంచి 10 గంటల వ్యవధిలో సంక్షోభం సమసిసోతుందని భరోసా ఇచ్చారు. శాంతి భద్రతల పరిస్థితి సవ్యంగా ఉంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.బ్లాకౌట్ కారణాలను తెలిపేందుకు విద్యుత్ సంస్థ అధికారులు నిరాకరించారు.