Tuesday, April 29, 2025

నేటి నుంచి ఎప్‌సెట్

- Advertisement -
- Advertisement -

మంగళ, బుధవారాల్లో అగ్రికల్చర్,
ఫార్మసీ పరీక్షలు మే 2 నుంచి
4వరకు ఇంజినీరింగ్ పరీక్షలు
ఒక్క నిమిషం ఆలస్యమైనా
అనుమతి నిరాకరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇఎపిసెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4వ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. మంగళ, బుధవారాలో(మే 29,30) తేదీలలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి, మే 2 నుంచి 4వ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండు సెషన్లలో పరీక్షలు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లోని 124 కేంద్రాల్లో ఇఎపిసెట్ పరీక్షల కోసం ఏర్పాట్లు చేశారు. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, రెండింటికీ 253 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు.

అమలులో నిమిషం నిబంధన
రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. పరీక్షా సమయానికి 90 నిమిషాల ముందు అంటే ఉదయం 7.30 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. కనీసం 20 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు కన్వీనర్ సూచించారు. విద్యార్థుల వివరాల పరిశీలనకు 20 నిమిషాల సమయం పడుతుందని, కాబట్టి విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు ఉదయం సెషన్‌కు 9 గంటల వరకు రిపోర్టింగ్ చేయాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ వెంట ఒక గుర్తింపు కార్డు, ఇటీవల తీసుకున్న ఫొటో తీసుకువెళ్లాలి. కళాశాల ఐడీకార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఓటర్‌ఐడీని గుర్తింపు కార్డుగా పరగణిస్తారు.

వీటికి అనుమతి ఉండదు
ఇఎపిసెట్ పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అనుమతి ఉండదు. పరీక్షా కేంద్రాలలోనే విద్యార్థులు మంచినీళ్లు అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్‌తో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం తీసుకెళ్లాలి. ఇఎపిసెట్ రాసే విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి. ఈ కారణంగా చేతులకు గోరింటాకు, ఇతర డిజైన్లు వేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుకుంటే బయోమెట్రిక్ హాజరుకు ఇబ్బంది ఉండదు.
ఈసారి హాల్‌ట టికెట్లపై క్యూఆర్ కోడ్
ఇఎపిసెట్ పరీక్షలకు ఈసారి క్యూఆర్ కోడ్‌తో హాల్ టికెట్లు జారీ చేశారు. హాల్ టికెట్లు గూగుల్ మ్యాప్స్‌కి లింక్ చేయబడిన క్యూఆర్ కోడ్ ముద్రించారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించడానికి, నావిగేట్ చేయడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉం దో తెలుసుకోవచ్చు.దానికి అనుగుణంగా వి ద్యార్థులు సులువుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News