Wednesday, April 30, 2025

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థతో ఉపాధికి ఊతం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయం, పరిశ్రమలే ఆర్థిక ప్రగతికి మూలస్తంభాలుగా నిలిచాయి. ఆ తర్వాత సేవల రంగం, సమాచార సాంకేతిక విప్లవం ఆర్థికాధిపత్యాన్ని చలాయించాయి. నేడు, 21వ శతాబ్దంలో, మానవ మేధస్సు, కల్పనాశక్తి, ప్రత్యేక ప్రతిభల సమ్మేళనమైన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ఒక నూతన శక్తిగా ఆవిర్భవిస్తోంది. ఇది కేవలం కళలు, సంస్కృతికి పరిమితమైనది కాదు; ఆర్థికాభివృద్ధికి ఒక బలమైన చోదకశక్తిగా, లక్షలాది మందికి ఉపాధి కల్పించే విస్తృత వేదికగా, అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠను పెంపొందించే ఒక మహత్తర సాధనంగా ఇది పరిగణించబడుతోంది. అపారమైన సాంస్కృతిక సంపద, ప్రాంతీయ వైవిధ్యం, యువ జనాభా కలిగిన భారతదేశానికి ఈ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ఒక అద్భుతమైన అవకాశాలనిధి. అయితే, ఈ సువర్ణావకాశాన్ని మనం ఎంతవరకు అందిపుచ్చుకోగలుగుతున్నామనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అంటే వ్యక్తిగత సృజనాత్మకత, ప్రత్యేక నైపుణ్యం, అంతర్గత ప్రతిభల ఆధారంగా వృద్ధిచెందే విభిన్న పరిశ్రమల సమూహం. ఇది మేధోసంపత్తిని ఉపయోగించి ఆర్థిక విలువను సృష్టిస్తుంది. హస్తకళలు, చిత్రలేఖనం, శిల్పం, మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, సంగీతం, నృత్యం, నాటకం, మీడియా, సినిమాలు, యానిమేషన్, డిజైన్, ప్రకటనలు, సాఫ్ట్‌వేర్, గేమింగ్ వంటి అనేక రంగాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి.డిజిటల్ విప్లవం, ఇంటర్నెట్ వ్యాప్తి ఈ ఉత్పత్తులు, సేవలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా చేరుకోవడానికి మార్గం సుగమం చేశాయి. ఈ రంగాలు పరస్పరం అనుసంధానమై ఆర్థిక విలువను పెంపొందిస్తున్నాయి. ప్రపంచ గణాంకాల ప్రకారం, సృజనాత్మక సేవల వాణిజ్యం 2022లో $1.4 ట్రిలియన్లకు చేరుకుంది. సృజనాత్మక వస్తువుల ఎగుమతులు $713 బిలియన్లు. ఈ రంగం ప్రపంచవ్యాప్తంగా $2 ట్రిలియన్ల ఆదాయాన్ని, 50 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తోంది. సాఫ్ట్‌వేర్, పరిశోధన -అభివృద్ధి, ప్రకటనలు ముఖ్యమైన సహకారులుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి.

భారతదేశానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం. మన సాంస్కృతిక వారసత్వం, యువత దీనికి ప్రధాన బలం. భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం $30 బిలియన్లు. ఇది మన జిడిపికి 2.5% తోడ్పడుతుంది. 8% మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వంటి చిన్నరంగం కూడా వేల కోట్ల రూపాయల విలువ కలిగి ఉంది. గౌహతి, కొచ్చి వంటి నగరాలు సృజనాత్మక కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. ఇది గ్రామీణ కళాకారులకు ఉపాధినిస్తుంది, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది, ఎగుమతులను పెంచుతుంది, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. అయినప్పటికీ, ఈ రంగం ఇంకా పూర్తిగా వ్యవస్థీకృతం కాలేదు. సమగ్ర జాతీయ విధానం కొరవడింది. చిన్నసంస్థలకు పెట్టుబడి లభించడం కష్టంగా ఉంది. పైరసీ, మేధో సంపత్తి ఉల్లంఘనలు సృజనకారుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. సరైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ నైపుణ్యాల కొరత వేధిస్తోంది. మార్కెటింగ్, బ్రాండింగ్ సమస్యలు ఉన్నాయి. ఈ రంగంపై సమగ్రమైన గణాంకాల కొరత విధాన రూపకల్పనకు ఆటంకం కలిగిస్తోంది.

ఈ సవాళ్లను అధిగమించడానికి, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ఒక కీలక రంగంగా గుర్తించి సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించాలి. ప్రత్యేక నిధులు, సులభ రుణాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కఠినమైన చట్టాలతో పైరసీని అరికట్టాలి. సృజనాత్మక కేంద్రాలు, డిజిటల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ అందించాలి. ఉత్పత్తుల ప్రదర్శనకు వేదికలు కల్పించాలి. సమగ్ర డేటా సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ మరింత కీలక పాత్ర పోషించనుంది. డిజిటలైజేషన్, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతలు కొత్త అవకాశాలు సృష్టిస్తాయి. భారతదేశం తన సాంస్కృతికశక్తిని, యువత నైపుణ్యాలను ఉపయోగించి ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ఇది ఆర్థికవృద్ధితో పాటు సామాజిక సమ్మిళితానికి, ప్రాంతీయ అభివృద్ధికి, దేశ ‘సాఫ్ట్ పవర్’కు తోడ్పడుతుంది. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో సృజనాత్మక రంగం ఒక కీలక చోదకశక్తిగా నిలవగలదు. ఈ దిశగా మనం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డి జె మోహన రావు
82470 45230

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News