గచ్చిబౌలి: ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఒక చక్కటి వేదికగా, ప్రజల చెంతకు పాలనగా వార్డు కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఈ చక్కటి ఆవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వారి సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రజల వద్దకు పాలన అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న వార్డు కార్యాలయాన్ని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోజోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సూచనల మేరకు నగరంలో పరిపాలను పౌరులకు మరింత చేరువ చేయాలన్న లక్షంగా వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల ప్రమేయంతో పాటు వారి భాగస్వామ్యాన్ని సుస్థిరం చేయడానికి పౌరల సౌకర్యార్థం ప్రస్తుత వ్యవస్థకు అవసరమైన విధంగా పునర్నిర్మాణంతో నాల్గవ పరిపాలనా వ్యవస్థ వార్డుస్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం నగరంలో 150 వార్డు కార్యలయాలలో 10 మంది సిబ్బందితో ఉంటారని అన్నారు.
అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని వార్డు ఆఫీసర్‌గా నిర్ణయించడమైందని, ఈ అధికారి పర్యవేక్షణలో పారిశుధ్యం, రోడ్ మెయింటనెంన్స్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, యుబిడి, యుసిడి, జలమండలి, ట్రాన్స్‌కో, ఇతర విభాగల నుంచి తీసుకోబడిన ఉద్యోగులను ప్రతి వార్డు కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిని త్వరిగతిన పరిష్కరించడానికి నియమించబడిందని, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల అమలులను కూడా పర్యవేక్షిస్తారని ఆయన పేర్కోన్నారు. అదేవిధంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల ప్రక్షాళన సంస్కరణల అమలుతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రగతి పథంలో శరవేగంగా దూసుకుపోతేందని, అందులో భాగంగానే వార్డు కార్యలయాల ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయని, సేవలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుందని, దేశంలోనే ఇలాంటి వ్యవస్థను మన నగరంలో మొదటిసారి ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం అని, ఇది ముఖ్యమంత్రి పాలన వ్యవస్థకు మరో మైలురాయని ఆయన కొనియాడారు.
ఈ వార్డు కార్యలయాలను కాలనీ ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఏరియా కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.