Sunday, December 22, 2024

ఢిల్లీ బాసులకు చెంప దెబ్బ

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ప్రజలు ఆత్మగౌరవానికి, అభివృద్ధికి పట్టం కట్టారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. కాంట్రాక్టులకు ఆశపడి పార్టీ మారి అనవసరంగా ఉపఎన్నికను తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి తగు రీతిలో బుద్ధి చెప్పారన్నారు. సిగ్గులేకుండా పార్టీ ఫిరాయింపులను పొత్సహిస్తున్న బిజెపి ఢిల్లీ బాస్‌లకు మునుగోడు ప్రజలుచెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని ప్రశంసిచారు. ఆదివారం మునుగోడు లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని పెద్దలు చెబుతుంటారన్నారు. అదే మునుగోడు ఎన్నికల్లో జరిగిందన్నారు. అహంకారంతో, డబ్బు మదంతో ఢిల్లీ బాసులు నరేంద్ర మోడీ, అమిత్ షా బలవంతపు ఉప ఎన్నికను మునుగోడు ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారన్నారు. కానీ మునుగోడు ప్రజలు వాళ్లిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికను రుద్దినవారికి మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుడుతో దిమ్మదిరిగిపోయిందన్నారు.

మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగుర వేసినందుకు సంతోషపడుతున్నామన్నారు. ఉప ఎన్నికలో కనిపించిన బిజెపి ముఖం రాజగోపాల్ రెడ్డిదే అయినా….ఆయన వెనకుండి ఆడించింది మోడీ, అమిత్ షాలేనని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసిన బిజెపి తె లంగాణలోనూ కూల్చేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. దీని వెనకున్నది మోడీ, అమిత్ షానే అని గుర్తించిన తెలంగాణ ప్రజలు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారని ప్రసంసించారు. మునుగోడులో రాజ్‌గోపాల్‌రెడ్డిని అడ్డదారిలోనైనా గెలిపించాలని ఢిల్లీ నుంచి వందల కోట్లు కుమ్మరించారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికను పూర్తిగా ధనమయం చేశారని పేర్కొంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు కోటి రూపాయాలతో దొరికిపోయాడని, ఈటల రాజేందర్ పిఎ కడారి శ్రీనివాస్ రూ.90 లక్షలతో పట్టుబడడం ఇందుకు నిదర్శమని కెటిఆర్ వెల్లడించారు.

అలాగే డాక్టర్ వివేక్ గుజరాత్ నుంచి రూ.2.5 కోట్లు హవాలా ద్వారా తెప్పించి దొరికిపోయారన్నారు. ఈ ఎన్నికల కోసం రాజగోపాల్ రెడ్డికి వివేక్ రూ.75 కోట్లు బదిలీ చేశారని ఆరోపించారు. జమున హేచరీస్ కు రూ.25 కోట్లు బదిలీ చేశారని వెల్లడించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ వివేక్…. ఓ హవాలా ఆపరేటర్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి రూ.5 కోట్లు మునుగోడు ఓటర్లకు, మునుగోడు బిజెపి నేతల ఖాతాల్లోకి బదిలీ చేశారని వివరించారు. వీటన్నింటిపై తాము ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, ఢిల్లీలో ఒత్తిడి తెచ్చి ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించేలా చేశారని ఆరోపించారు. అయినప్పటికీ మునుగోడు ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధికే ఓటు వేశారన్నారు.

అధికార మదాన్ని తొక్కి పెట్టారు

బిజెపి నేతలఅధికార మదాన్ని మునుగోడు ప్రజలు భలే తొక్కిపెట్టారని కెటిఆర్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మోడీ సర్కార్ కుల్చిందని మండిపడ్డారు. అదే తరహాలో తెలంగాణలోనూ క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపిందని విమర్శించారు. దీని వెనక మోడీ, అమిత్ షాలు ఉన్నారని తెలిసే చైతన్యవంతమైన మునుగోడు ప్రజలు తమ తీర్పుతో వారికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. నిజానికి టిఆర్‌ఎస్ అభ్యర్థికి ఇంకా మెజారిటీ రావాల్సి ఉండేనని అన్నారు. కానీ తమకున్న సమాచారం ప్రకారం బిజెపి ఢిల్లీ, గల్లీ నాయకత్వం.. మొట్టమొదటి సారిగా ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు వందల కోట్ల రూపాయలను తరలించారని ఆరోపించారు.

ఢిల్లీ నుంచి అధికార దుర్వినియోగం
కేవలం ఒకటీ రెండు కాదని…ఈ ఎన్నికలో ఢిల్లీ నుంచి బిజెపి చేసిన అధికార దుర్వినియోగం, విచ్చలవిడి తినానికి పరాటకష్టగా మారిందని కెటిఆర్ విమర్శించారు. 15 కంపెనీల సిఆర్‌పిఎఫ్ పోలీసులను దించారు. 45 ఐటి టీమ్‌లను దించి ఏడు మండలాల్లో గ్రామీణ నియోజకవర్గ మీద దండయాత్ర వచ్చినట్టే వచ్చారన్నారు. చివరకు తమ పార్టీకి చెందిన నేతలను కూడా లొంగదీసుకునేందుకు పెద్దఎత్తున డబ్బులు పంచారని విమర్శించారు. వీటిపై ఎలక్షన్ కమిషన్‌కు షికాయత్ చేస్తే ప్రేక్షకపాత్ర వహించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇలా ఎన్ని చేసిన చివరకు టిఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. కొంత మెజారిటీని ప్రలోభ పెట్టి తగ్గించగలిగారని కెటిఆర్ పేర్కొన్నారు.

నల్లొండ ప్రజలు చరిత్ర లిఖించారు
సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని కెటిఆర్ అన్నారు. మునుగోడు విజయంతో నల్గొండ జిల్లాల్లో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు గులాబీ వశమయ్యాయని తెలిపారు. నల్గొండ ప్రజలు చరిత్ర లిఖించారని, వారికి శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని కెటిఆర్ అన్నారు. కాగామునుగోడు నియోజకవర్గంలో తమతో కలిసి నడిచిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర వామపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అలాగే గెలుపులో భాగంగా వేలాదిగా పని చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్‌కు, 40 రోజులుగా పార్టీ అభ్యర్థికి కోసం గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండుకి శిరస్సు వహించి…పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News