తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో వీగిపోడం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాల విజయావకాశాలను దెబ్బ తీసేదిగా వుంది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఆ పార్టీ ఓడిపోయిందని సరిపెట్టుకొన్నా మధ్యప్రదేశ్‌లో దాని పరాజయం ఒక పట్టాన మింగుడు పడేది కాదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా వచ్చి కమల్‌నాథ్ సారథ్యంలో ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పటికీ బిజెపి కుతంత్రంతో దానిని పడగొట్టి గద్దె ఎక్కింది. ఆ విధంగా అప్పుడు ప్రజాస్వామ్యానికి కమల నాథులు చేసిన విద్రోహం ఇప్పుడు కమలం పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తుందని కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని అనుకొన్నారు. కాని అలా జరగలేదు. దీర్ఘ కాలం ముఖ్యమంత్రి గా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పక్కకు తప్పించి బిజెపి చేసిన కృషి ఈసారి దానికి మధ్యప్రదేశ్‌లో ఊహించని విజయాలు కట్టబెట్టాయి. దానితో ఆ రాష్ట్రం మరో గుజరాత్‌లా తనకు కంచుకోట కాగలదనే ధీమా బిజెపిలో కలిగింది.
రాజస్థాన్‌లో సమర్థుడైన అశోక్ గెహ్లాట్ సారథ్యంలో ఆనవాయితీకి భిన్నంగా అక్కడ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు రుజువు కాలేదు. చత్తీస్‌గఢ్‌లో కూడా అదే జరిగింది. ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘేల్ సంపాదించుకొన్న మంచి కీర్తి అక్కడ కాంగ్రెస్‌కు మళ్లీ అధికారాన్ని ఇచ్చి తీరుతుందన్న అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ వైఫల్యం కేవలం ఆ పార్టీదే కాబోవడం లేదు. బిజెపి హ్యాట్రిక్ ఆశలను వమ్ము చేసి దేశానికి తిరిగి సెక్యులర్ పాలనను తీసుకు రావాలని ప్రతిపక్షాలన్నీ సంఘటితంగా నిర్మించుకొన్న ఆశా సౌధాలు కూలిపోయే సూచనలు కాంగ్రెస్ ఓటమిలో కనిపిస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో తన గెలుపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయానికి బాట కానున్నదని బిజెపి చెప్పుకోడం ప్రారంభించింది. అదే నిజమైతే దేశంలో రాగల మార్పులను ఊహించుకొంటేనే భయోత్పాతం కలుగుతుంది.
ప్రస్తుత రాజ్యాంగం మీద బొత్తిగా గౌరవం లేని బిజెపి లోక్‌సభలో ఇప్పటి బలంతో అయినా తిరిగి అధికారంలోకి వస్తే హిందూత్వ రాజకీయాల ప్రాబల్యం మరింతగా పెరగడం ఖాయం. రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు తరహా సామాజిక న్యాయ లక్షణాలను పూర్తిగా తొలగించి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడానికి అది వెనుకాడదు. అలాగే ఒకే దేశం, ఒకే ఎన్నిక వ్యూహాన్ని అమలు పరచి ప్రజలు తరచుగా తమ తీర్పు చెప్పడానికి ఇప్పుడున్న అవకాశాలను హరించి వేస్తుంది. ఇవి ప్రజాస్వామ్యానికి మంచి సంకేతాలు ఎంత మాత్రం కావు. బిజెపిని మరోసారి దేశాధినేత కానివ్వకుండా చేయగల ప్రత్యామ్నాయ శక్తి లేదనే అభిప్రాయానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలు దోహదం చేస్తున్నాయి. కాంగ్రెస్ మినహా ఇతర ఏ ఒక్క పార్టీకీ దేశమంతటా చెప్పుకోదగిన ఉనికి లేదు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాంగ్రెస్‌పైనే ఆశలు పెట్టుకొని ‘ఇండియా’ (భారత జాతీయ సమ్మిళిత అభివృద్ధి కూటమి) ను తెర మీదికి తెచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి తీవ్ర విభేదాలు తలెత్తినప్పుడే ‘ఇండియా’ కూటమికి బీటలు వారిన సూచనలు కనిపించాయి. ఇప్పటి కాంగ్రెస్ ఓటమితో ఆ బీటలు వెడల్పయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు సార్లు విఫలమై ఇప్పటికీ బలం పుంజుకోలేకపోతున్నది. అందుకు స్వీయ అపరాధాలే కారణం. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో, చత్తీస్‌గఢ్‌లలో అది మరింతగా మనసు పెట్టి దృష్టి కేంద్రీకరించి పని చేసి వుండవలసింది. కాని ఈ మూడు రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులను దారికి తీసుకు రాలేక చతికిలబడినట్లు కనిపిస్తున్నది.
వారు కోరిన విధంగా వారిపైనే భారం వేసి చేతులు ముడుచుకొన్నది. అలాగే బిజెపి వంటి బలమైన గట్టి పార్టీ వ్యవస్థ కలిగిన శక్తిని ఓడించడానికి అవసరమైనన్ని అస్త్రాలను అది సమకూర్చుకోలేకపోతున్నది. ద్వితీయ శ్రేణి హిందూత్వ పార్టీగా కొనసాగినంత కాలం కాంగ్రెస్ గట్టి ప్రత్యామ్నాయ శక్తి కాజాలదు. రాహుల్ గాంధీ కొత్తగా కుల గణన నినాదం తెచ్చినప్పటికీ ఆచరణలో దానిని విజయవంతంగా చేపట్టి పూర్తి చేయడానికి తగిన శక్తియుక్తులు ఆయనకు లేవని రుజువవుతున్నది. రాష్ట్రాల్లో ఆ పార్టీ అగ్ర వర్ణాల యాజమాన్యంలో ఎల్లకాలం కొనసాగుతూ వుండడం కూడా దానికి నష్టదాయకమే. లోక్‌సభ ఎన్నికలకు గట్టిగా ఆరు మాసాల వ్యవధి కూడా లేదు. ఈలోగా ‘ఇండియా’ కూటమి లోపాలను సవరించుకొని గట్టి ఉమ్మడి ప్రతిపక్ష శక్తిగా రూపొందగలుగుతుందా?