హైదరాబాద్ : పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన బాలుడి ఫిర్యాదును ఛాంబర్ నుంచి బయటికి వచ్చి తీసుకుని మానవత్వం చాటుకున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్. చేర్యాల గ్రామ పరిధిలోని ఓ గురుకుల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఫిబ్రవరిలో నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అదే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న తుమ్మల హనివర్దన్ రెడ్డి అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు.
ఆ సమయంలో పాఠశాల యాజమాన్యం బాలుడి చికిత్స ఖర్చు మొత్తం భరిస్తామని చెప్పింది. కాని తర్వాత వారు పట్టించుకోలేదు. దీంతో పాఠశాల మేనేజ్‌మెంట్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సిపి డిఎస్ చౌహాన్‌కు ఫిర్యాదు చేశాడు. బాలుడి చికిత్స గురించి పట్టించుకోని పాఠశాల మేనేజ్‌మెంట్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చిన్న పిల్లల పరిరక్షణ కోసం రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. బాలుడికి తోడుగా అతడి బాబాయి నరేష్‌రెడ్డి వచ్చారు.