Monday, December 23, 2024

నకిలీ డాక్యుమెంట్ల ముఠా గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

రెండు ముఠాల్లోని 18 మంది నిందితుల పట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్ : నకిలీ డాక్యుమెంట్ల ముఠా గుట్టును కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి, బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకుల నుంచి పలు రకాల రుణాలు ఇప్పిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్ పల్లి, కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధుల్లో నమోదైన కేసుల ఆధారంగా రెండు ముఠాల్లోని మొత్తం 18 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల్లో.. మొదటి కేసులో మేడ్చల్ జిల్లా సూరారంకు చెందిన ఘంటా రంగారావు (నకిలీ రబ్బర్ స్టాంప్‌లు, సర్టిఫికెట్స్, డాక్యుమెంట్ల సృష్టికర్త), కెపిహెచ్‌బి కాలనీకి చెందిన ఎస్.మానిక్‌ప్రభు(రబ్బర్ స్టాంప్ మేకర్), కూకట్‌పల్లికి చెందిన పంచికర్ల నాగ మల్లేశ్వరరావు(ఏజెంట్), కూకట్‌పల్లికి చెందిన కొత్తపల్లి సుధాకర్‌రావు(లోన్ కన్సల్టెంట్), మేడ్చల్ జిల్లా సూరారంకు చెందిన కాగిత సేతరామరాజు అలియాస్ పండు (నకిలీ సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ ప్రింటింగ్), జీడిమెట్లకు చెందిన కొండేటి చంద్రశేఖర్‌రావు (లేఅవుట్ ప్లాన్స్ ట్యాంపరింగ్)లు ఉన్నారు.

రెండో కేసులో కూకట్‌పల్లికి చెందిన వాకా నాగిరెడ్డి (ఎబిఎల్ లోన్స్ ఓనర్), జగద్గిరిగుట్టకు చెందిన కరిమి షణ్ముఖరావు (నిధి అసోసియేట్స్ ఓనర్), జగద్గిరిగుట్టకు చెందిన కొల్లి రామరాజు(ఆర్‌ఆర్ అసోసియేట్స్ ఓనర్), కూకట్‌పల్లికి చెందిన దొంతుల మణికంట(డిఎంకె అసోసియేట్స్ ఓనర్), జగద్గిరిగుట్టకు చెందిన రేవూరి దొరబాబు(ఏజెంట్), సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలానికి చెందిన బొత్స మహేష్(ఎజెంట్),మేడ్చల్ జిల్లా మల్లంపేట్ విలేజికి చెందిన లక్ష్మణ్ రాకేష్ కుమార్ (ఏజెంట్), కూకట్‌పల్లికి చెందిన ఎం.చంటి(ఎబిఎల్ ఉద్యోగి), కూకట్‌పల్లికి చెందిన పి.నవీన్‌కుమార్(ఎబిఎల్ ఉద్యోగి), హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన డి.వీరబాబు(డిఎంకె ఉద్యోగి), కూకట్‌పల్లికి చెందిన జి.రామ్‌తివారి(డిఎంకె ఉద్యోగి), జగద్గిరిగుట్టకు చెందిన కొల్లి శంకర్‌రావు (ఆర్‌ఆర్ ఉద్యోగి)లు ఉన్నారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 1687 నకిలీ రబ్బరు స్టాంపులు, 1180నకిలీ డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు తయారు చేసేందుకు ఉపయోగించే పరికరాలు, 10 లాప్‌టాప్‌లు, 8 ప్రింటర్స్, స్టాంపులను తయారు చేసే యంత్రాలు, 57సెల్‌ఫోన్‌లు, వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

ఇవే కాకుండా నిందితులు వాడే డూప్లికేట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. నిందితులు జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, రెవెన్యూ డిపార్టుమెంట్లకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్స్, సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నేరగాళ్లు ఏజెంట్ల సాయంతో వారికి గృహ, ఇతర రుణాలు ఇప్పిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. నకిలీ డాక్యు మెంట్లతో రుణాలు ఇప్పించడంలో బ్యాంకు అధికారుల పాత్ర ఉండే అవకాశం లేకపోలేదని, ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నామని వివరిం చారు. రెండు నెలలుగా ఈ కేసు పైన దృష్టి పెట్టి ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను పట్టుకోగలిగామన్నారు.

ఇప్పటివరకు సుమారుగా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఈ ముఠాలు మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. ‘కూకట్‌పల్లిలో సుధాకర్ అనే వ్యక్తి హోం లోన్ ఏజెన్సీని నడుపు తున్నాడు. ఎవరైనా ఇంటి లోన్ కావాలనుకుంటే అతడిని సంప్రదిస్తారు. ఆయన ఏ డాక్యుమెంట్లు కావాలో తెలుసుకొని వేరే వ్యక్తి, ప్రధాన నిందితుడు రంగారావు వద్దకు పంపిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ డాక్యుమెంట్లను క్రియేట్ చేస్తారు. వారే స్వయంగా బ్యాంకులో ఆ పేపర్లను ఇచ్చి ఇంటి లోన్ ఇప్పిస్తారు. ప్రధాన నిందితుడు రంగారావును 2005, 2012లో కూడా ఫేక్ డాక్యుమెంట్ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద ప్రధానంగా మూడు టీంలు ఉంటాయి. అందులో మొదటి టీం ఫేక్ లేఅవుట్‌లు తయారు చేస్తారు. రెండో టీం డాక్యుమెంట్లను తయారు చేస్తారు. మూడో టీం రబ్బరు స్టాంపులను తయారు చేస్తారని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ ముఠా ఎక్కువగా హోం లోన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. వీరికి సిటీ మొత్తం చాలా మంది ఏజెట్లు ఉన్నారని వారిపై కూడా విచారణ జరుపుతున్నట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News