మన తెలంగాణ/ ఏన్కూరు: మండల కేంద్రమైన ఏన్కూరు పెట్రోలు బంకు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతిచెందగా మరో 12 మంది గాయపడ్డారు. వివరాలలోకి వెళితే.. మండల కేంద్రమైన ఏన్కూరులోని పెట్రోలుబంక్ సమీపంలో కల్లూరు మండలం అంబేద్కర్‌నగర్ కు చెందిన 14మంది మహిళా కూలీలు మిరప కోతలకు ఏన్కూరుకు ఆటోలో వెళుతుండగా ఏన్కూరు సమీపంలోని పెట్రోల్ బంకులో కూలీలుగల ఆటో ప్రెటోలు నింపుకొని రోడ్డుపైకి వస్తుండగా కొత్తగూడెం నుండి ఖమ్మం వైపు అతి వేగంగా వస్తున్న టి.ఎస్ 04 యు.ఇ1983 నంబరు గల కారు మహిళా కూలీలు గల ఆటోను అతివేగంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకొన్న ఏన్కూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి, స్వల్పంగా గాయపడినవారిని ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: మేం వెయిట్ చేసినందుకు.. చాలా పెద్ద సక్సెస్ వచ్చింది: కార్తీక్ దండు
అనంతరం ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రినందు ప్రథమ చికిత్స నిర్వహించి క్షతగ్రాతులను తిరిగి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేము వరమ్మ 45 సంవత్సరాలు, బీరవల్లి వెంకటమ్మ 40 సంవత్సరాలు మృతిచెందారు. గాయపడిన వారిలో కోటపల్లిసంధ్య, ఉబ్బన సుభద్ర, మేకల శాంతమ్మ, మేకల సువార్త, అలవాల నాగరాజులకు బలమైన గాయలయ్యాయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోజు కూలీకెళ్తేనే గాని పూటగడవని కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పలువురిని కలచివేసింది.