ములుగు : స్వచ్ఛ ఓటరు జాబితా తయారు చేయడమే లక్షంగా అధికారులు పనిచేయాలని, భారత ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ , ఐటిడిఏ పిఓ అంకిత్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్‌లతో కలిసి సంబంధిత అధికారులతో స్వచ్ఛ ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధ్దతపై భారత ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశంలో స్వచ్ఛ ఓటరు జాబితా రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఓటర్ల జనాభా నిష్పత్తి, పురుష, స్త్రీ ఓటర్ల నిష్పత్తి పోలింగ్ కేంద్రాల వారీగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ తహసీల్దారులకు సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని, తిరస్కరించే దరఖాస్తులకు, ఆమోదించిన దరఖాస్తులకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఓటరు జాబితాలో ఉండి మరణించిన వారి పేర్లను ఫామ్7తో తొలగించాలని, గ్రామ పంచాయతీలు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా జాబితా నుండి పేర్లు తొలగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి దరఖాస్తు యొక్క ఫైల్ అందుబాటులో ఉండాలని, ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ పకడ్బందీగా స్వచ్చ ఓటరు జాబితా రూపకల్పన దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ కార్యాలయ ఏఓ విజయభాస్కర్, తహసీల్దార్లు, డిప్యూటేషన్ తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, ఆర్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.