ఆసిఫాబాద్: ఎన్నికల నిర్వహణలో స్పష్టమైన ఓటరు జాబితా ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో జిల్లా అదనపు కలెక్టర రాజేశం, డిఅర్‌డిఓ రాజేశ్వర్‌తో కలిసి ఫోటో ఓటరు జాబితా రూపకల్పనపై ఎన్నికల ఆధికారులు, సహాయ ఎన్నికల ఆధికారులు, తహసిల్దార్‌లు, నాయబ్ తహసిల్దార్‌లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎఎవఎంటి, డిఎల్‌ఎంటి శిక్షణ పొందిన వారు బూత్ స్థాయి ఆధికారులకు శిక్షణ ఇచ్చే సమయంలో ఓటరు జాబితా రూపకల్పన, ఓటు యొక్క విలువ తెలియజేయాలని తెలిపారు. 2 వ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కొనసాగుతున్నందున జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మహిళలు, దివ్యాంగులు, అదివాసి, ట్రాన్స్‌జెండర్లు అర్హత గల వారి అందరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా శ్రద్ద వహించాలని అన్నారు. ఓటరు జాబితా కచ్చితంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడే ఎన్నికలు సజావుగా సాగుతాయని తెలిపారు. ఓటరు జాబితా తయారు చేయడంలో బూత్ స్థాయి ఆధికారుల పాత్ర కీలకమైందని, వారికి శిక్షణ ఇచ్చే సమయంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.