ఆసిఫాబాద్: స్పష్టమైన ఓటరు జాబితా రూపోందించే విధంగా అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, డిఅర్‌ఓ రాజేశ్వర్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా నిరూపించాలని, 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరు తమ ఓటు వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉన్న ఓటర్లను సమీప పోలీంగ్ కేంద్రానికి మార్చుకునే విధంగా అవకాశం కల్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల పూర్తిస్థాయి ఏజెంట్లు ఇంటికి వెళ్తున్న సందర్భంగా చనిపోయిన రెండు ఎపిక్ కార్డులు కలిగిన వారి వివరాలను గుర్తించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తోలగించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నూతనంగా నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణికి చర్యలు తీసుకోవాలని, 1 వేయి 300 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రానికి అదనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోని ఓటరు జాబితాలో పేర్లు తప్పులు ఉన్న వాటిని సవరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.