- మహబూబాబాద్ కలెక్టర్ శశాంక
గార్ల: ప్రభుత్వాసుపత్రి పనితీరు మెరుగు పర్చేందుకు యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం గార్ల మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ శశాంక సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో వసతులను పరిశీలిస్తూ పోస్టుమార్టం గది, డైట్ షెడ్, 108 వాహనం వచ్చేందుకు సీసీ రోడ్డు పనులు చేపట్టాలన్నారు. ఆసుపత్రి పనితీరు మెరుగు పర్చేందుకు యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని, ఓపీ పెంచాలన్నారు. గర్బిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు.
బయో మెడికల్ వృథాను గ్రామపంచాయతీ చెత్తలో కలపరాదన్నారు. డాక్టర్లు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రి ముందు భాగంలో వాహన రాకపోకలకు మార్పులు చేపట్టాలన్నారు. రోగులతో వైద్యం ఎలాంటి అందుతుందని అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి సిబ్బంది భోజన సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు సీతంపేట నర్సరీని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మొక్కలను వినియోగించని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఏ సన్యాసయ్య, జిల్లా జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకుడు వెంకటరాములు, డాక్టర్ రమేశ్, టీఎస్‌ఎం ఐడీసీ డీఈ శ్రీనివాస్, తహసీల్దారు స్వాతి, బిందు, ఎంపీడీఓ రవీందర్, గార్ల సర్పంచ్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.