జి-7 వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు, ఉక్రెయిన్ పరిస్థితిపై విశ్లేషణ
హిరోషిమా : ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా, ఎప్పుడైనా భౌగోళిక ప్రాదేశికత కీలకం అని, ఈ యధాతథ స్థితిని మార్చే ఎటువంటి ఏకపక్ష యత్నాలనైనా నివారించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ఇందుకు అంతా కలిసి సంఘటితంగా వ్యవహరించాలని తెలిపారు. జపాన్‌లోని హిరోషిమాలో జి7 సదస్సు ముగింపు దశలో ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడారు. ఏ ప్రాంతపు యధాతథస్థితి అయినా ఆయా ప్రాంతాలకు ప్రాణప్రదమే అవుతుంది. ఉక్రెయిన్‌లో ఇప్పుడు మానవతా, మానవీయ అంశాల విషయం.
ఇది రాజకీయ, ఆర్థిక సంబంధితం కాదని తెలిపిన మోడీ ఏ దేశం అయినా ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతలకు కట్టుబడి ఉండాల్సిందే. అదే విధంగా అంతర్జాతీయ చట్టాల నిర్ధేశిత పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి వివాదం, ఉద్రిక్తతలను అయినా సంప్రదింపుల క్రమంలో శాంతియుతంగా పరిష్కరించుకోవల్సి ఉంటుందని ప్రధాని సూచించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభం గురించి తాము శనివారం జెలెన్‌స్కీతో మాట్లాడినట్లు, ఘర్షణ నివారణకు భారతదేశం తన లేకుండా కృషి చేస్తుందని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని ప్రధాని తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితి జి 7 సదస్సులో ప్రధాన చర్చనీయాంశం అయింది.
శత్రుత్వాన్ని కరుణతో శాంతింపచేయాలనే గౌతమ బుద్ధుడి బోధనలు ఆధునిక ప్రపంచం పాటిస్తే మంచిదని హితవు పలికారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని శాంతికాముక శక్తులు యత్నించాల్సి ఉందన్నారు. ఇటువంటి సంక్లిష్టతలకు కేవలం సంప్రదింపులు, దౌత్యనీతి పరిష్కార మార్గం అనేదే ఆది నుంచి భారతదేశ అభిప్రాయం అన్నారు. ఇరుపక్షాల నడుమ సరైన దౌత్య ప్రక్రియలో సంప్రదింపులు జరిగి, సమస్య పరిష్కారం కావల్సి ఉందని, ఇందుకు తమ తరఫున అన్ని విధాలుగా పాటుపడుతామని మోడీ వివరించారు. భారత్‌లో కానీ జపాన్‌లో కానీ భగవాన్ బుద్ధను వేలాది ఏండ్లుగా అనుసరిస్తూ వస్తున్నారు. జటిల సమస్యల పరిష్కారానికి బుద్ధుని బోధనలను పాటిస్తే అది సంక్షుభిత మానవాళికి మంచి జరుగుతుందన్నారు. మూడు దేశాల పర్యటనకు వచ్చిన ప్రధాని ఆదివారం జపాన్ నుంచి పపూవా న్యూ గినియాకు వెళ్లారు. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లుతారు.
గొప్పల ఐరాస వేదిక గప్పాలకేనా : మోడీ
ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి చివరికి ఇప్పుడు పిచ్చాపాటి వేదికలుగా మారనున్నాయని ప్రధాని మోడీ జి 7 సదస్సు నుంచి చేసిన ప్రసంగంలో తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రపంచ వేదికలు ప్రస్తుత ప్రపంచ వాస్తవికతలను ప్రతిఫలించకపోతే సంస్థలుగా అవి నిరర్ధకం అవుతాయన్నారు. శాంతి సుస్థిరతల పరిరక్షణ బాధ్యత ఐరాసపై ఉంది. మరి వీటికి సవాళ్లు ఏర్పడినప్పుడు వివిధ వేదికల నుంచి ఎందుకు వీటిపై వాదోపవాదాలు చర్చలు జరుగుతున్నాయని ప్రశ్నించారు.
ప్రపంచంలో తలెత్తే ఘర్షణలను నివారించుకునేందుకు ఐరాస ఏర్పడినప్పుడు, మరి ఈ బాధ్యతల నిర్వహణలో ఈ సంస్థ ఎందుకు విఫలం అవుతోందని సందేహం వ్యక్తం చేశారు. చివరికి ఐరాస వేదిక ఇంతవరకూ ఉగ్రవాదంపై నిర్వచనం విషయంలో కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. వీటిన్నింటిని బేరీజు వేసుకుంటే ఒక్క విషయం స్పష్టం అవుతోంది. గత శతాబ్ధంలో ఏర్పాటు అయిన ఈ సంస్థ ఇప్పటి వాస్తవికతలను గుర్తించడం లేదు. 21వ శతాబ్ధానికి అనుగుణంగా అప్‌డేట్ కాలేదనే గుర్తించాల్సి ఉంటుందన్నారు. ఐరాసలో భారీ స్థాయి సంస్కరణల ప్రక్రియకు భారతదేశం డిమాండ్ చేస్తోందన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి ఏళ్ల తరబడిగా విఫలయత్నానికి దిగుతూ వస్తోంది.