Monday, January 20, 2025

‘కూల్ రూఫ్’ ఉంటేనే అక్యుపెన్సీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు ‘కూల్ రూఫ్ తప్పనిసరి’ అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కూల్ రూఫ్ ఉంటేనే అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ పాలసీ ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుందని, ఇప్పుడున్న ఇళ్లతో పాటు కొత్త ఇళ్లకు కూల్ రూఫ్ అమలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. రూప్‌తో పాటు గోడలకు కూడా పెయింట్ వేస్తే ఇంకా చల్లగా ఉంటుందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ‘కూల్ రూఫ్ పాలసీ’ని తీసుకొస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని ఆయన చెప్పారు. మొదట తన ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్నారు.

హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లోని సిడిఎంఏ కార్యాలయంలో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకునేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన ‘తెలంగాణ కూల్ పాలసీ 2023, 28’ను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. కూల్ రూఫ్ పాలసీలో భాగంగా ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, ట్రిపుల్ ఐటీ, జీహెచ్‌ఎంసిలతో కలిసి చలువ భవనాన్ని ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వం 2019లో ముసాయిదాను విడుదల చేంది. వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి తుదిరూపు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ, ఆస్కీ కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో ప్రయోగాత్మకంగా చలువ నిర్మాణాలను నిర్వహించి పనితీరును పరిశీలించి ప్రభుత్వం ‘కూల్ రూఫ్ పాలసీ’ని అమల్లోకి తీసుకొచ్చింది.

చలువ పైకప్పులతో భవనాల లోపల వేడి తగ్గుతుంది…

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం మొత్తంలోనే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన స్పష్టం చేశారు. బెంగుళూర్‌లోని ఆఫీస్ స్పేస్‌తో పాటుగా, ఎంప్లాయ్‌మెంట్‌లో కూడా హైదరాబాద్ దాటిందన్నారు. టిఎస్ బిపాస్‌తో దేశంలో ఎక్కడాలేని విధంగా భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నామని కెటిఆర్ చెప్పారు. వేసవిలో పెరుగుతున్న ఎండలతో నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఎండ వేడిమికి తట్టుకోలేక పోతున్నాయన్నారు. ఫలితంగా జనం ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని, ఈ క్రమంలోనే చల్లదనం కోసం ఎసిల వాడకం పెరుగుతోందన్నారు. తద్వారా కాలుష్య ఉద్గారాలు అధికమవుతుందని, ఎసిలు అమర్చుకోలేని సామాన్యులు వేడిమి వల్ల వడదెబ్బ బారినపడి అనారోగ్యం పాలవుతున్నారని, చలువ పైకప్పులతో భవనాల లోపల వేడి తగ్గడంతో పాటు కరెంట్‌ను ఆదా చేయవచ్చని కెటిఆర్ తెలిపారు.

2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ టాప్

ఈ ఏడాది హైదరాబాద్‌లో 5 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ అమలుచేస్తామని అందులో భాగంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు సైతం కూల్ రూఫ్‌ను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్మించే ఈ ఇళ్ల పైన 10 కోట్ల చదరపు కిలోమీటర్లు కూల్ రూఫ్ చేసే అవకాశం ఉందన్నారు. దీనిని ఏర్పాటు చేయడం వల్ల పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు.2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ టాప్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. మిగతా ఏరియాలో 100 చదరపు కిలోమీటర్లు కూల్ రూఫింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.కూల్‌రూప్ వల్ల మీటర్‌కు రూ.300 మాత్రమే ఖర్చవుతుందన్నారు. కూల్‌రూప్ పెయింట్ వేయడం వల్ల కరెంటు చార్జీలు కూడా ఆదా అవుతాయన్నారు. ఇప్పటికే కట్టిన భవనాలపై కూడా కూల్‌రూప్ విధానం అమలు చేయొచ్చని ఆయన వెల్లడించారు.

అవసరమైన ప్రోత్సాహం అందిస్తాం

ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో కూల్‌రూప్ ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని, అనుసరించే వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. పాలసీలు, చట్టం చేయడం చాలా సులువని, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనిఅన్నారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలన్నదే సిఎం కెసిఆర్ ఆశయమని ఆయన తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం హైదరాబాద్‌లో రెండు ప్లాంట్‌లను ఏర్పాటుచేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

అందరికీ లాభం చేకూరేలా పాలసీ

భవిష్యత్ తరాల కోసం చేపట్టిన ఈ మంచి కార్యక్రమం (కూల్ రూఫ్‌తో) తాత్కాలిక లక్ష్యాలతో, అందరికీ లాభం చేకూరేలా పాలసీ ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణలో అన్ని డిపార్ట్‌మెంట్‌లు చాలా బాగా పని చేస్తున్నాయని, మన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 2014లో ఈసీబిసిని అడాప్ట్ చేసుకున్నామని, హరిత హారంలో మొక్కలు నాటుతున్నామని, ఎన్నో అవార్డులు గెలుచుకున్నామని ఐటి మంత్రి కెటిఆర్ అన్నారు. ఎనర్జీ ఎఫిషీయంట్ మెషిన్‌లను వాడమని చెబుతున్నామని, మన భవిష్యత్ తరాల కోసం తెస్తున్న పాలసీ ఇది అని ఆయన పేర్కొన్నారు.

మున్సిపాలిటీల్లో దీనిని అమలు చేస్తాం

హైదరాబాద్‌తో పాటుగా మున్సిపాలిటీల్లో దీనిని అమలు చేస్తామని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే కూల్ రూఫ్ కార్యక్రమం 100 శాతం విజయవంతం అవుతుందన్నారు. సిపిఆర్ విషయంలో ప్రతి అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అవగా హన కల్పించాలని, అవసరమైతే ఇన్‌సెంటివ్ ఇస్తామన్నారు. ఆర్‌డబ్లూఎస్‌ను కూడా ఇందులో భాగస్వామం చేస్తామన్నారు. త్వరలో ‘మన నగరం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. రెండు సి అండ్ డి వేస్ట్ ప్లాంట్‌లను ప్రారంభించా మన్నారు. వాటి ద్వారా కూల్ బ్లాక్స్ చేసే వీలు ఏమైనా ఉంటుందా అనేది చూడాలని కెటిఆర్ పేర్కొన్నారు. అర్భన్ రూఫ్ ఫామింగ్ ఇప్పుడు ఎక్కువగా కనబడుతుందని, వాటిని ఎంకరేజ్ చేయాలని ఆయన సూచించారు. ‘కూల్‌రూఫ్’ వల్ల 5 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందన్నారు. గది ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, ఆధునిక సాంకేతికతతో పైకప్పులకు ఉపయోగించే సామగ్రిలో కొన్ని మార్పులు చేయడంతో పాటు ప్రత్యేక రసాయనాల వినియోగంతో 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని కెటిఆర్ తెలిపారు.

నాలుగు ఓట్లు వస్తాయని ఈ విధానం తీసుకురాలేదు

నాలుగు ఓట్లు వస్తాయని కూల్ రూఫ్ పాలసీ విధానం తీసుకురావడం లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. కూల్‌రూప్ విధానాన్ని తీసుకొచ్చిన అధికారులకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. ఈ విధానం ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే 50 ఏళ్లలో 5 వేల ఏళ్లలో జరిగిన నగరీకరణ జరగబోతోందని ఆయన పేర్కొన్నారు.

వాస్తు కాన్సెప్ట్‌లో సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి…

వాస్తు అంటే కొందరికీ మూఢనమ్మకమని, కెసిఆర్ వాస్తును నమ్ముతారని మంత్రి కెటిఆర్ తెలిపారు. కానీ, వాస్తు కాన్సెప్ట్‌లో సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నారు. బిల్డింగ్ ప్లానింగ్ స్టేజీలోనే ప్లాన్ చేసుకుంటే కూల్‌రూఫింగ్‌తో ఖర్చు ఒకటి రెండు శాతానికి మించి పెరగదన్నారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు మన స్కీంలు కాపీ కొట్టినట్టే మనం దీనిలో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయితే రేపు మొత్తం అమలు చేయాలని అడగొచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News