మన తెలంగాణ/ హైదరాబాద్ : అక్రమ నల్లా కనెక్షన్ దారులపై జలమండలి విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. బోర్డు సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన 26 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం. 19, పీర్జాదిగూడ సెక్షన్ పరిధిలోని సుమతి టవర్స్ అపార్టుమెంట్లో నివాసముంటున్న నర్సింగ్ రావుతో మరో 26 మంది అధికారుల అనుమతి లేకుండా రెండు 25 ఎంఎం, ఒక 20 ఎంఎం పరిమాణం గల పైపు లైను కనెక్షన్లు తీసుకుని నీటిని వాడుకుంటున్నారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీలో భాగంగా ఈ విషయం బయట పడింది. దీంతో నర్సింగ్ రావుతో పాటు మరో 25 మందిపై మేడిపల్లి పోలీసు స్టేషన్ లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద కేసు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 నంబర్ల ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరు.