పే రివిజన్ కమిటీకి టియస్ యుటిఎఫ్ ప్రతిపాదనలు
మన తెలంగాణ/హైదరాబాద్: వర్తమాన సామాజిక పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలకు పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గౌరవ ప్రదమైన వేతనాలు నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, పే రివిజన్ కమిటీ చైర్మన్ ఎన్.శివశంకర్‌ను కోరింది. సోమవారం టియస్‌యుటిఎఫ్ కమిటీ సభ్యులు కె. జంగయ్య, చావ రవి రాష్ట్ర 2వ వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎన్. శివశంకర్, సభ్యులు బి. రామయ్యలను కలిసి వేతన సవరణ ప్రతిపాదనలు సమర్పించి చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ అక్ట్రాయిడ్ ఫార్ములా ప్రపంచ కార్మిక సదస్సు నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగి కుటుంబం ఆరోగ్యంగా జీవించటానికి అవసరమైన కనీస వేతనాన్ని నిర్ణయించాలని కోరారు. గత ఐదేళ్ళలో రాష్ట్ర జియస్‌డిపి జాతీయ సగటుకన్నా 60.03 శాతం అభివృద్ధి సాధించినందున, ఆమేరకు ఉద్యోగుల వేతనాలు కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గత పిఆర్‌సి నివేదిక 30 నెలలు ఆలస్యంగా ఇవ్వడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారని, ఈ దఫా అటువంటి నష్టం జరగకుండా సకాలంలో నివేదికను ప్రభుత్వానికి అందజేసి, గత ఏడాది ఆగస్టు నుండి ఆర్థిక ప్రయోజనం వర్తింప జేయాలని పేర్కొన్నారు. వేతన కమిటీ సిఫారసులు ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలకు వర్తింపజేయాలని, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగుల సంక్షేమానికి కూడా తగిన సూచనలు చేయాలని ప్రతిపాదించారు.