Sunday, December 22, 2024

సైలెంట్‌గా కొనసాగుతున్న ప్రలోభాల పర్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ బిఆర్‌ఎస్‌తో సహా అన్ని పార్టీలకు ఈ సారి ‘డూ ఆర్ డై’ అన్నట్టే ఉన్నాయి. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటం, ప్రచారం మంగళవారంతో ముగియనున్న క్రమంలో అన్ని నియోజకవర్గాలలో సైలెంట్‌గా ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. చాప కింద నీరులా డబ్బు పంపిణీ సాగుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు ఇంతకాలం ఎన్నికల ప్రచారం సాగించి, ఇప్పుడిప్పుడే పోల్ మేనేజ్మెంట్‌పై దృష్టి పెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో తమకు బలమున్న ప్రాంతాలు ఏంటి? బలం లేని ప్రాంతాలు ఏంటి? తదితర వివరాలను తెలుసుకొని తదనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు.

ఒక వైపు ఓటర్లను తమ వైపు కు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ప్రత్యర్థుల పైన ఫోకస్ పెట్టారు. డబ్బు, మద్యం పంపిణీకి అభ్యర్థులు తెర తీయడంతో ప్రత్యర్థులను నిలువరించే వ్యూహాలకు పదును పెట్టారు. ఏయే ప్రాంతాలలో ప్రత్యర్థుల మనుషులు తిరుగుతున్నారో నిఘా పెట్టి, ఆయా ప్రాంతాలలో డబ్బు పంపిణీ జరగకుండా చూస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లకు, ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి డబ్బు పంపిణీ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రలోభాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కుల సంఘాలకు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున పార్టీలు ఇస్తూ వారిని తమ వైపుకు తిప్పుకుంటున్న నేతలు, ప్రధానంగా నియోజకవర్గంలో తమకు ఎక్కడ ఓటు బ్యాంకు బలహీనంగా ఉందో ఫోకస్ పెట్టి, అక్కడ ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలలో భారీగానే డబ్బు పంపిణీ జరుగుతుందని సమాచారం. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అన్ని పార్టీలు హోరాహోరీ గానే తలపడుతున్నాయి. జాతీయ నాయకులను రంగంలోకి దించి ప్రచారంలో దుమ్ము దులిపాయి. మొత్తంగా చూస్తే ఈసారి ఎన్నికలలో జోరుగా ప్రలోభాలు కొనసాగే అవకాశం ఉండగా, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసే పనులు అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఉన్నారు. ఆ దిశగా వారంతా పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News