Sunday, January 19, 2025

‘పర్యాటకం’కు పండగే

- Advertisement -
- Advertisement -

వరుస సెలవులతో కిటకిట లాడుతున్న టూరిజం ప్రాంతాలు
ఇప్పటికే చారిత్రక స్థలాలు, కోటలకు పునర్వైభవం తెచ్చిన సర్కారు
దీంతో ఈ శాఖకు రోజుకు లక్షల్లోనే ఆదాయం

మన తెలంగాణ / హైదరాబాద్ : దసరా, దీపావళి, ఉగాది…పండుగ ఏదైనా చిన్నారులు ఆ సెలవులకోసమే వేచి చూస్తుంటారు. దసరా పండుగకు ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ నుండి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. దీంతో సుమారు పది రోజుల పాటు వరుస సెలవులు ఉండడంతో టూరిజం శాఖకు చెందిన పలు పర్యాటక ప్రాంతాలు కిటకిట లాడుతున్నాయి. ఇలా పర్యాటక శాఖ టూరిస్టులకు ఒక పక్క అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూనే మరో వైపు తనకు భారీగా ఆదాయం సమకూరుతుండడంతో సంబర పడుతోంది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలపై ఆ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే రామప్పకు యునెస్కో గుర్తింపు నివ్వడంతో దాని ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతోంది. వరంగల్‌కు 77 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయం ప్రస్తుతం పర్యాటక స్వర్గధామంగానూ మారుతోంది. దీంతో ఈ ఆలయం ఎక్కడుందంటు మన రాష్ట్రంలోని వారే కాకుండా దేశ విదేశాల వారూ గూగుల్‌లో సర్చ్ చేస్తు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. తెలంగాణ వారే కాదు..దేశ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా రామప్ప వద్దకు చేరుకుని ఆలయ అందాలకు ముగ్ధులవుతున్నారు. ఇలా ఆలయాల సందర్శనకు భారీగా రద్దీ పెరుగుతోంది. నిజానికి వర్షాలు కూడా సమృద్దిగా కురిసి ఉంటే జలపాతాలకు కూడా ఇదే స్థాయిలో పర్యాటకుల నుండి ఆదరణ ఉండేదని ఆ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.
చారిత్రక ప్రాంతాలకు పెద్ద పీట
కాగా తెలంగాణ రా్రష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కోటలకు, చారిత్రక ఆలయాలకు పెద్ద పీట వేసింది. దీంతో రాజధాని హైదరాబాద్‌తో పాటు సమీపంలోని కోటలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలోనే చార్మినార్‌తో పాటు చౌమహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, నెహూ జూపార్కు, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్, నాంపల్లి రైల్వేస్టేషన్‌ను పలువురు పర్యాటకులు భారీగా సందర్శించి సంబర పడుతున్నారు. గోల్కొండ కోటతో పాటు యాదాద్రి సమీపంలోని భువనగిరి కోటకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు అమిత ఆసక్తిని కనబరుస్తున్నారు. కాగా మరి కొందరు రాజధాని హైదరాబాద్‌ను ఎప్పుడు చూస్తున్నామని, ఇతర పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు తమ పిల్లలు అసక్తిని కనబరుస్తారని వారి తల్లిదండ్రులు చెబుతుండడం గమనార్హం.
రోజుకు లక్షల్లోనే ఆదాయం…
కాగా పర్యాటకుల సందర్శనతో ఆ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ప్రతి ప్రాంతంలో రోజుకు లక్షల్లోనే ఆదాయం వస్తోంది. గడచిన ఏడు రోజుల్లోనే ఈ ఆదాయం కోట్లకు చేరుకుంటుండడం విశేషం. కాగా పర్యాటకుల నుండి వచ్చే ఈ మొత్తాన్ని తిరిగి వివిధ రూపాల్లో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసి పర్యాటకులకు అధిక ప్రాధాన్యతను ఇస్తుండడం మరువలేమని పలువురు పర్యాటకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ సారి బోటింగ్‌కు ప్రాధాన్యత…
కాగా ఈ సారి కృష్ణానదిలో నీటి లభ్యతను బట్టి బోటింగ్‌కు ప్రాధాన్యతను ఇవ్వాలని పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే శ్రీశైలం నుండి సోమశిల తదితర ప్రాంతాలకు వెళ్లే బోటింగ్‌ట్రిప్‌లకు పర్యాటక శాఖ తరుచూ నిర్వహిస్తోంది. బోటు ప్రయాణాలు ఉండే విధంగా ట్రిప్‌ని ప్లాన్ చేయడంతో బోటింగ్ ప్రియులు ఈ ట్రిప్‌కి వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పర్యటనకు రోజురోజుకీ తాకిడి కూడా పెరుగుతున్నట్లు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ట్రిప్‌కి వచ్చే పర్యాటకులకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంటి భోజనాన్ని తలపించేలా హరిత హోటల్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వేములవాడ, కొండగట్టు, కొమురవెల్లి మల్లన్న ఆలయాలకు వెళ్లొచ్చేందుకు ఒక్క రోజు టెంపుల్ ట్రిప్ ప్యాకేజ్ కూడా అందుబాటులో ఉందని, దీని కోసం రూ.1200 ఛార్జ్ చేస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడంతో పర్యాటకుల సంఖ్య పెరిగిందని, హైదరాబాద్ నుంచి రెండు రోజుల ప్రత్యేక ట్రిప్‌ను రూపొందించినట్లు టూరిజం శాఖ తెలిపింది. పర్యాటకుల ఆలోచనలకు అనుగుణంగా టూరిజం శాఖ పలు చర్యలు తీసుకుంటుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News