Friday, November 22, 2024

బిఆర్‌ఎస్‌కు వలసల వెల్లువ

- Advertisement -
- Advertisement -

రెండు రోజుల్లో గులాబీ గూటికి చేరిన
కాంగ్రెస్, బిజెపి కీలక నేతలు
కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన
తుల ఉమ, పాల్వాయి శ్రవంతి
హరీశ్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లోకి వైఎస్‌ఆర్‌టి నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా వలసలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన కీలక నేతలు గులాబీ గూటికి చేరారు. బిజెపి పార్టీకి మరో షాక్ తగిలింది. వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బిజెపి నాయకురాలు తుల, ఉమఆ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. అనంతరం ఆమె తిరిగి గులాబీగూటికి చేరుకున్నారు.

కెటిఆర్ సమక్షంలో సోమవారం తుల ఉమ తన అనుచరులతో కలిసి తిరిగి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కెటిఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి ఆదివారం మంత్రి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో సోమవారం బిజెపి రాష్ట్ర నాయకుడు సుదగాని హరిశంకర్ గౌడ్, యాదగిరిగుట్ట మాజీ ఎంపిపి పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్, మెడబోయిన పరుశరాములు, సూదగాని ఉదయ్ కిరణ్ గౌడ్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనంతుల తిరుమల్‌రెడ్డి, నల్లెడ తిర్మల్ రెడ్డి, అమృత శివకుమార్, పల్లె నరేందర్ గౌడ్ బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

తుల ఉమకు సముచిత స్థానం : కెటిఆర్
తుల ఉమకు బిజెపి వేములవాడ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, గుంజుకోవడం చాలా బాధాకరమని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ అన్నారు. ఇది మహిళలకే కాకుండా బిసిల పట్ల బిజెపి వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గత హోదాకంటే కూడా మరింత సముచిత హోదాను, బాధ్యతలను ఆమెకు అప్పగించి గౌరవించుకుంటామని ఈ సందర్భంగా కెటిఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం నుంచి సీనియర్ మహిళా నాయకురాలిగా, నాడు సిఎం కెసిఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా తుల ఉమక్క పనిచేశారని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ సూచన మేరకు స్వయంగా తానే ఉమక్కకు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించాను అని, ఆమె తన ఆహ్వానాన్ని మన్నించి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతి కోసం ఉమ అక్క సేవలు అవసరమని కెటిఆర్ తెలిపారు. బిజెపి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండదని తుల ఉమ మండిపడ్డారు. తనకు ఎంఎల్‌ఎ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి కేటాయించారని మండిపడ్డారు. బిజెపి బిసి ముఖ్యమంత్రిని చేయడం అనేది కల మాత్రమే అని, అందుకు తానే ఉదాహరణ అని విమర్శించారు. తనకు చెప్పింది ఒకటి చేసింది ఇంకోటి అని పేర్కొన్నారు.

15 రోజుల్లో కుట్రలు జరుగబోతున్నాయి…జాగ్రత్త : కెటిఆర్
వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు. దున్నపోతు ఈనిందని ఒకరంటే, దుడ్డెను కట్టేయండని మరొకరు అంటారని ఎద్దేవాచేశారు. కండ్లముందు కనబడేది నిజం కాదట.. సోషల్ మీడియాలో కనిపించేది, ఢిల్లీ నుంచి వచ్చి చెప్పేవాళ్లది నిజమట అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి శ్రవంతి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరాన్ని ఇంకా బద్నాం చేయడానికి ఇంకొకరు రిపోర్టులు తయారు చేస్తారన్నారు. తెలంగాణలో ఏదీ బాలేదని చెప్పడానికి ఢిల్లీలో బిజెపి, కాంగ్రెస్ ఆఫీసుల్లో వండివార్చిన వంటకాలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేసేలా మోదీ, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తారని ఆరోపించారు. తెలంగాణకు మిగిలిఉన్న ఒకే ఒక్క గొంతుక కెసిఆర్ అని, ఆయనను ఇక్కడే ఖతం చేస్తే మహారాష్ట్రకు రాడు, దేశ రాజకీయాల్లోకి రాడనే ఉద్దేశంతో కుట్రలు చేస్తారని చెప్పారు. మరో రెండు విషయాలపై కూడా ఇలాంటి రిపోర్టుల వస్తాయన్నారు.

మునుగోడులో ఎందుకు ఉపఎన్నికలు వచ్చాయో రాజగోపాల్‌రెడ్డికే తెలియాలి
ఎన్నికలు వస్తుంటయ్.. పోతుంటయ్.. కానీ మునుగోడులో ఎందుకు ఉపఎన్నికలు వచ్చాయో, రాజగోపాల్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలోకి వెళ్లారో.. ఇప్పుడు అదే పార్టీలోకి ఎందుకు తిరిగొచ్చారో ఆయనకే తెలియాలని కెటిఆర్ అన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబ నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉందని, ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి పేరు చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆమాత్రం ఓట్లయిన వచ్చాయని చెప్పారు. పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఒకరినొకరు తిట్టుకున్న రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఒక్కటయ్యారని విమర్శించారు. డబ్బుమదంతో రాజకీయాలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ధన రాజకీయాలను తిరస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మునుగోడు బిడ్డలు మరొకసారి తెగువ చూపాలని, రాజగోపాల్ రెడ్డి అహంకారాన్ని, ధనమదాన్ని వంచాల్సిన అవసరం ఉందన్నారు.
కర్ణాటక మోడల్ అట్టర్ ఫ్లాప్ కావడంతో..కాంగ్రెస్ మాట మార్చేసింది : హరీశ్‌రావు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే సిఎం పదవి కోసం కుర్చీల కొట్లాట ప్రారంభమవుతుందని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మంత్రి టి.హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కర్ణాటక మోడల్ అట్టర్ ఫ్లాప్ కావడంతో హస్తం నేతలు మాట మార్చేశారని ఆరోపించారు. 24 గంటల కరెంటు ఇచ్చే తెలంగాణలో.. 5 గంటలపాటు విద్యుత్ ఇస్తామంటే.. ఎవరైనా ఓటు వేస్తారా…? అని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో వైఎస్‌ఆర్‌టిపి నాయకులు గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో పలువురు నేతలు, అన్ని జిల్లా కో ఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి బిఆర్‌ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, వైఎస్‌ఆర్‌టిపి పార్టీని బిఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలను మంత్రి హరీశ్ రావు స్వాగతించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా..? పార్టీ నడపగలుగుతారా..? తెలంగాణ వాళ్లకు అంత సీను ఉందా అనే అవహేళన మాటలు ఎన్నో విన్నామని పేర్కొన్నారు. ఇలాంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదు అని అవహేళన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుని అమలు చేసేలా చేసిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని చెప్పారు. తండ్రి సమానులైన కెసిఆర్‌ను రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈరోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల అని విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News