Thursday, January 23, 2025

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః లారీలో భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను టిఎస్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(టిఎస్ న్యాబ్) అధికారులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 208కిలోల గంజాయి, లారీ, కారును స్వాధీనం చేసుకున్నారు. టిఎస్ న్యాబ్ ఎస్పి సునీత ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, ఉస్మానాబాద్ జిల్లా, హిట్‌కూర్ గ్రామానికి చెందిన రాజు అంబాదాస్ షిండే డ్రైవర్, బాలాజీ అర్జున్ కాలే, నిఖిల్ నందకుమార్ గౌహాలి, మధుకర్ అర్జున్ కాలే, సంజయ్ రవీంద్ర చౌహాన్ కలిసి గంజాయి తరలిస్తున్నారు. ఉస్మానాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు హసన్ గంజాయి తరలించే బాధ్యతను రాజు అంబాదాస్‌కు ఇచ్చాడు. ఎపిలోని విజయనగరం జిల్లా, పార్వతీపురం నుంచి గంజాయి మహారాష్ట్ర, పూణేకు రవాణా చేస్తే రూ.2లక్షలు ఇస్తానని చెప్పాడు.

దీనికి అంగీకరించిన రాజు తన బంధువులను గంజాయి రవాణాకు ఒప్పించాడు. అందరు కలిసి మహారాష్ట్రకు చెందిన లారీని మాట్లాడుకుని, దానిలో రహస్యంగా ఓ బాక్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రహస్యంగా ఏర్పాటు చేసుకున్న బాక్స్‌లో దాదాపుగా 250 కిలోల గంజాయి పట్టేలా చేశారు. నిందితులు ఐదుగురు కలిసి ఎపిలోని విజయనగరానికి వచ్చి అక్కడ 104 ప్యాకెట్లలో ఉన్న గంజాయిని లారీలో లోడ్ చేసుకుని బయలు దేరారు. లారీకి ముందు 30కిలో మీటర్ల దూరంలో కారులో రాజు, బాలాజీ, నిఖిల్ ప్రయాణించే వారు, వారికి పోలీసుల తనిఖీలు ఎదురైతే వెంటనే లారీలో ఉన్న వారికి సమాచారం ఇచ్చే వారు. ఇలా పైలెట్‌గా కారును ఏర్పాటు చేసుకుని విజయనగరం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న విషయం టిఎస్ న్యాబ్ పోలీసులకు తెలిసింది. వెంటనే వారి కోసం కాపుగాచిన పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల, నక్కలబండ తండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పి నర్సింగరావు, ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, డానియల్, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News