Monday, November 25, 2024

నకిలీ పత్తి విత్తనాల సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -
  •  రూ.1 కోటి 80 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం
  •  నిందితులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం

నల్గొండ : నకిలీ పత్తి విత్తనాల సరఫరా చేస్తున్న ముఠా నల్లగొండ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పూర్తి వివరాలను వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకుని వారి నుంచి రూ.1 కోటి 80 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వ్యవసాయశాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి అక్రమార్కులను పట్టుకుంటున్నామన్నారు. బుధవారం తెల్లవారు జామున నార్కట్ పల్లి పోలీసు స్టేషన్ ఎస్‌ఐ డి.సైదా బాబు, ఎస్‌ఐలు విజయ్ కుమార్, ఈ.రవి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.

సికింద్రాబాద్‌లోని అల్వాలహిల్స్కు చెందిన గోరంట్ల నాగార్జున, ఏపీ స్టేట్ పల్నాడు జిల్లా పెద్దకూరపాడుకు చెందిన గడ్డం రవీంద్రబాబు, నంద్యాల జిల్లా గోసపాడు మండలం, జిల్లెల గ్రామానికి చెందిన మెరిగె వేణులు అక్రమంగా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తుండగా నార్కట్పల్లి ఫ్లైఓవర్ వద్ద తనిఖీ చేసి అనుమానాస్పదంగా కనిపించడంతో వారు ప్రయాణిస్తున్న కారు ఏపీ 39బీపీ6345ను తనిఖీ చేయగా అందులో రెండు బస్తాల విడి విత్తనాలు లభించాయన్నారు. వీరు తక్కువ ధరకు కర్నాటక రాష్ట్రంలో రైతుల నుంచి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద స్టోరేజీ చేసి మహారాష్ట్రలోని నాగపూర్‌కు తరలించి అక్కడ రైతులకు ఎక్కువ ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారన్నారు.

నకిలీ పట్టి విత్తనాలను నేరస్థులు బీజీ 3 అని చెప్పగా వాటిని పరీక్షల నిమిత్తం వ్యవసాయ అధికారుల ద్వారా డీఎన్‌ఏ సీడ్ టెస్టింగ్ ల్యాబ్ మలకపేట్‌కి పంపించి నిర్దారణ చేయడం జరుగుతుందన్నారు. వీరి నుంచి రూ.1కోటి 80లక్షల విలువైన 10వేల కేజీల విడి విత్తనాలను, ఎర్టిగా కార్ నెం.ఏపీ 39 బీపీ 6345, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండకు తరలించామన్నారు. రైతులను మోసం చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, నకిలీ విత్తనాలు అమ్మినా సరఫరా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు.

రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తక్కువ ధరలకే విత్తనాలు విక్రయించే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. లైసెన్స్ దారులు అమ్మే విత్తనాల ప్యాకెట్ మీద పూర్తి వివరాలు ఉంటాయని, రైతులు విత్తనాలు కొనేటప్పుడు వీటిని గమనించాలని సూచించారు. ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నల్లగొండ డీఎస్పీ నరసింహ రెడ్డి ఆద్వర్యంలో చిట్యాల సీఐ శివ రామ్ రెడ్డి, నార్కెట్ పల్లి ఎస్‌ఐ సైదా బాబు, చిట్యాల ఎస్‌ఐ రవి, ఎస్‌ఐ విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్స్ శివ శంకర్, గిరిబాబు, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఎస్పీ అభినందిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News