Sunday, January 19, 2025

తెలంగాణ ఔనత్యాన్ని చాటి చెప్పిన కవి సమ్మేళనం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కవికి మాత్రమే ఉందని అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాగర్‌కర్నూల్ నూతన సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రతిబింభించేలా నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపచేసింది. ఈ కవి సమ్మేళనానికి జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన సుమారు 53 మంది కవులు తమ సందర్భోచిత కవితా వచనాలతో సమ్మేళనానికి వన్నెలద్దారు.

ఒకరికొకరు ధీటుగా దశాబ్ద తెలంగాణ ప్రగతిని ప్రతిభింబించేలా అక్షర విన్యాసాలు, పదబంధాలను ప్రయోగిస్తూ సాహితీ పిపాసుల మనసులను రంజింపచేశారు. దాశరథి నుంచి జాలువారిన నా తెలంగాణ ప్రాశస్తం, పోరుబాటలో కందనూలు కవులు పోషించిన పాత్ర, సాహితి లోకంలో ఈ ప్రాంతానికి గల ప్రత్యేకత గురించి కవులు వీనుల విందుగా తమదైన రీతిలో కవితాత్మకత ధోరణిలో అభివర్ణించారు. ప్రస్తుత దశాబ్ది పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధికి -పోషిస్తున్న పాత్ర గురించి విడమరచి కవితాగానం ద్వారా చెప్పారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈ దశాబ్ద కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 వసంతాలు నిండుతున్నందున తెలంగాణ స్ఫూర్తిని, ఈనాటి అభివృద్ధిని కవుల ద్వారా తిరిగి వినడం అద్భుతంగా ఉందని, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కవికి మాత్రమే ఉందని అన్నారు. ఎంతో మంది కవులు పద్య, వచన, కవితల ద్వారా తెలంగాణ పోరాటంలోనే కాకుండా, సమాజంలో జరిగే అన్యాయాలపై కూడా ప్రజలను ఉత్తేజితులను చేశారని, చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో కవులది ప్రముఖ పాత్ర ఉందని అందరికి తెలిసిందేనని అన్నారు.

నేటి విద్యార్థులు రచనలు, కవితలు చదవాలని, తద్వారా ఙ్ఞాన సముపార్జన పెంచుకోవాలని ఆయన అన్నారు. మరో ముఖ్యఅతిథి అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్ మాట్లాడుతూ కవిత్వం, సాహిత్యం వ్యక్తుల వ్యక్తిత్వానికి పునాదులని అన్నారు. మానవ సంబంధాలు అంతరించిపోతున్న ఈ కాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మంచి సమాజాన్ని చూడగలుగుతామన్నారు. కవులు సమాజ హితం కోరి వారి కవితల ద్వారా తెలుగు భాషా ప్రాశస్తాన్ని సమాజంలో వృద్ధ తల్లిదండ్రుల పట్ల పిల్లలు ప్రవర్తిస్తున్న తీరు, పిల్లల మానసిక అశాంతిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరించి ఇంత ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాంను అభినందించారు.

అంతకు ముందు డిపిఆర్‌ఓ సీతారాం మాట్లాడుతూ కందనూలు జిల్లా కవులనుకు ప్రసిద్ధి అని, కవులు తమ కవిత గానంతో సమాజాన్ని ప్రభావితం చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కవుల గానం వాటి ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌ఓ సీతారాం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నర్సింగ్ రావు, డిపిఓ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ, జిల్లా యువజన సర్వీసుల క్రీడల శాఖ అధికారి నటరాజ్, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News