మన తెలంగాణ / హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవాన్ని కన్నుల పండుగగా చేపట్టారు.ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం ప్రారంభమైంది. మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్ళలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.
ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతిజ్యోతులను మంగళవాయిద్యాల నడుమ ఏర్పాటు చేశారు.ఈ కార్తీక దీపోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, ఈవో ఏవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, డిఎల్వో శ్రీ వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈఓ లోకనాథం, విజివో నందకిషోర్ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.