రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడులపై ఫిర్యాదు
మన తెలంగాణ/హైదరాబాద్ : హుజూర్ నగర్ , మానకొండూర్ , భూపాలపల్లి , కొల్లాపూర్ నియోజక వర్గాల్లో బిఆర్‌ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడులను, హత్యలను బిఆర్‌ఎస్ నాయకుల బృందం డిజిపి దృష్టికి తెచ్చారు. సోమవారం మంత్రి కోమటి రెడ్డి సమక్షంలో ఆయన ప్రోద్భలంతో భువనగిరి జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు జరిపిన దాడిని డిజిపికి బిఆర్‌ఎస్ నాయకులు వివరించారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ బిఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని డిజిపికి నేతలు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిజిపిని బిఆర్‌ఎస్ నేతలు కోరారు. డిజిపిని కలిసిన వారిలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ , ఎంఎల్‌సి ఎల్ రమణ, మాజీ ఎంఎల్‌ఎలు సైది రెడ్డి , భాస్కర్ రావు , కోరుకంటి చందర్ ,భువనగిరి జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి , సూర్యాపేట జెడ్‌పి చైర్ పర్సన్ దీపిక , బిఆర్‌ఎస్‌వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి , రాకేశ్ కుమార్ తదితరులున్నారు.