Thursday, January 23, 2025

జర్నలిస్టుల సంక్షేమంపై జనవరి 15 తర్వాత ఉన్నతస్థాయి సమావేశం

- Advertisement -
- Advertisement -

ఐజెయూ, టియుడబ్ల్యుజె ప్రతినిధి బృందానికి మంత్రి పొంగులేటి హామీ

మన తెలంగాణ / హైదరాబాద్ :  జర్నలిస్టుల ఇంటి స్థలాలు, సంక్షేమ చర్యలపై జనవరి 15తర్వాత సంబంధిత ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలోని మంత్రి చాంబర్ లో ఐజెయు అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల నేతృత్వంలో ఐజెయు కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, టియుడబ్ల్యుజె ఉపాధ్యక్షులు కె.రాంనారాయణలతో కూడిన ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.

మంత్రితో జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఇంటి స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు జారీ చేసిన జిఓలు, మెమోలను సేకరించాలని, వాటి ద్వారా ఇచ్చిన స్థలాల వివరాలు, స్వాధీనం చేయకుండా ఉన్న స్థలాల వివరాలు, ఇకముందు ఇవ్వడానికి అనువైన స్థలాలను నిర్ధిష్టంగా పేర్కొంటూ నివేదికలు పంపించాలని రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రతినిధి బృందానికి మంత్రి వెల్లడించారు. ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ గత రెండు దశాబ్దాలుగా ఇంటి స్థలాలు ఇవ్వనందున జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఉన్నారనే విషయాన్ని ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్ళింది.

చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ విషయాన్ని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించగా… ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ముఖ్యమంత్రితో చర్చించి తప్పని సరిగా పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల నివేశన స్థలాలు, ఇతర సంక్షేమ చర్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై ఒక విధానపరమైన ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై టియుడబ్లుజె ఇచ్చిన 3పేజీల వివరణాత్మక వినతి పత్రాన్ని కూలంకశంగా చదివి చర్చించిన మంత్రికి ప్రతినిధి బృందం కృతఙ్ఞతలు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News