Monday, December 23, 2024

పెట్టుబడులపై చైనా వల

- Advertisement -
- Advertisement -

రూ.903కోట్ల భారీ మోసం
యాప్‌లు పంపి డబ్బు కాజేస్తున్న ముఠా డబ్బంతా చైనాకు
తరలినట్లు అనుమానం అంతర్జాతీయస్థాయిలో సాగుతున్న
దందా ఈ మోసాన్ని గుర్తించలేకపోయిన డిఆర్‌ఐ దేశ
భద్రతకు ముప్పుగా మారిన స్కాం ఈ కుంభకోణంలో
ఇద్దరు చైనీయుల కీలకపాత్ర

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ఓ ఫిర్యాదు దారుడు ఇచ్చిన ఫిర్యాదు (సైబర్ క్రైం పోలీస్ స్టేషన్, ఎఫ్‌ఐఆర్ నెం.352/2022) ఆధారంగా కూపీ లాగిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు భారీ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు చైనీయులు సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టుబడి పెట్టింది ఒక్కరు కాదని దేశ వ్యాప్తంగా అనేక మంది ఉన్నారని తేలింది. ఇలా పెట్టుబడుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్మును ఇండియన్రూపీస్‌ను డాలర్ రూపంలో మార్చి హవాలా చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రూ. 903 కోట్లు రూపాయలు మోసం చేసి ఇతర దేశాలకు తరలించారు. అయితే ఇది దర్యాప్తు చేసే కొద్దీ లోతు తెలుస్తుందని, ఇంకా పెద్ద మొత్తంలో ఉండవచ్చని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ రకమైన హవాలా ముఠాను సిసిఎస్, సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకోవడం దేశంలోనే తొలిసారి అని అన్నారు. ఇడి, డిఆర్‌ఐ కూడా ఇప్పటి వరకు ఇలాంటి మోసాలను గుర్తించలేక పోయిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే స్కామ్ ఇదని, దేశ భద్రతకు ముప్పు ఉందని అనుమానిస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు 10 వేల నుండి 50 వేల కోట్లు వరకు ఈ స్కామ్ జరిగి ఉండొచ్చన్నారు. కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ యాప్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసినట్లు గుర్తించా మన్నారు. ఫేక్ అకౌంట్లు, వర్చువల్ అకౌంట్ లు ఓపెన్ చేసి మోసం చేస్తున్నారన్నారు. దేశంలో రూ.50 వేల కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఆర్‌బిఐ లైసెన్సు పొంది విదేశీ లావాదేవీలు నిర్వహించేవారు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఫెమా చట్టం కింద లావాదేవీలు నిర్వహించకుండా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రధాన సూత్రదారులు ఇద్దరు చైనాలో ఉన్నారని తెలిపారు. ముంబయిలో తైవాన్‌కు చెందిన చున్ యూను పట్టుకున్నామని అన్నారు. చున్ యూ అనుచరులు వరుణ్ అరోరా, ముకేశ్ దుబాయ్‌లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిందితుల ద్వారా దిల్లీలో సాహిల్ , సన్నీ లావాదేవీలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దిల్లీలో మనీ ఎక్స్‌ఛేంజ్ లైసెన్సు పొందిన కౌశిక్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయని సివి ఆనంద్ పేర్కొన్నారు. రంజాన్ మనీ కార్పొరేషన్ ద్వారా 7 నెలల్లో రూ.441 కోట్లను విదేశీ నగదుగా మార్చారని తెలియజేశారు. కెడిఎస్ మనీ ద్వారా 38 రోజుల్లో రూ.462 కోట్లను విదేశీ నగదుగా మార్చారని వెల్లడించారు. ఈ స్కామ్‌పై ఇడి, డిఆర్‌ఐతో కలిసి దర్యాప్తు చేయనున్నామని తెలిపారు.

క్రిప్టో కరెన్సీతో పాటు పలు రకాల పెట్టుబడులు పేరుతో సెల్‌ఫోన్‌లకు సందేశాలు పంపుతున్న నిందితులు స్పందించిన వారికి యాప్ డౌన్‌లోడ్ చేయిస్తున్నారు.అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడి పెట్టిస్తున్నారు. వచ్చిన లాభాలను నేరగాళ్లు వ్యాలెట్‌లో చూపిస్తున్నారు. నమ్మిన తర్వాత ప్రజలు అధిక మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అనంతరం యాప్ ను డిలీట్ చేస్తున్నారు. ఇలా అధిక లాభాల కోసం పెట్టుబడి పెట్టి వారిని సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఈ సొమ్మంతా చైనాకు వెళతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

నైజీరియన్లను మించిన చైనీయులు…

ఆన్ లైన్ మోసాల్లో నైజీరియన్లదే హవా. వారు చెప్పే మాటలకు బుట్టలో పడిపోయి సర్వం పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారిని మించిపోయారు చైనీయులు. లోన్ యాప్స్ పేరుతో వారు చూపించిన నరకానికి ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు మరో రూపంలో మోసాలు ప్రారంభించారు. దానికి పెట్టుబడి అనే పేరు పెట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News