Monday, January 20, 2025

26న మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26వ తేదీన బిఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్ ( భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ సిఎం అశోక్ చౌహాన్ మీద కేవలం వెయ్యి వోట్ల తేడాతో ఓడి పోయారు).

ఎన్సీపి నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, మహారాష్ట్ర ఎన్సీపి యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, ఎన్సీపి నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపి అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, ఎన్సీపి లోహ అధ్యక్షుడు సుభాష్ వాకోరే, ఎన్సీపి కాందార్ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు అడ్వొకేట్ విజయ్ ధోండగే, ఎన్సీపి యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వాప్నిల్ ఖీరే తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సిఎం కెసిఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ విధి, విధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సిఎం కెసిఆర్ తో వారు సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు వారు కెసిఆర్‌తో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే, నాందేడ్ ఇంచార్జీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా …

బిఆర్‌ఎస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కెసిఆర్ దార్శనికత దేశ ప్రజలతో పాటు, రాజకీయాల్లో తలపండిన వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులను ఆకట్టుకుంటోంది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా యావత్ దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా సాగుతున్న బిఆర్‌ఎస్ పార్టీ విధి, విధానాలు నచ్చి ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు పలు రాష్ట్రాల నుంచి బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల నాందేడ్ సభ పెద్ద ఎత్తున విజయవంతమై భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారి చర్చకు దారితీయడం, భారత ప్రజల కోసం, వారి అభివృద్ధి సంక్షేమం కోసం బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ కృషిని మహారాష్ట్ర సహా, ఉత్తర భారత ప్రజలు అర్థం చేసుకోవడంతో భారీగా బిఆర్‌ఎస్‌లోకి వలసలు ఎక్కువయ్యాయని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News