Tuesday, December 24, 2024

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. దిల్లీ లిక్కర్ కేసులో కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ నిర్వహించింది. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కు వాయిదా వేసింది. అక్టోబర్ 18న పిఎంఎల్‌ఎ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు. ఈ విచారణ అనంతరం కవిత పిటిషన్ పై విచారణ చేపడతామన్నారు. అయితే అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎంఎల్‌సి కవితను విచారణకు పిలవబోమని ఇడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఏ స్థాయిలో ఉన్నారనేది పక్కనబెడితే అసలు విచారణకు పిలవద్దంటే ఎలా? అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అన్నారు. అయితే మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 20కు వాయిదా వేసినట్లు తెలిపారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలంటూ ఇడి జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇడి నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. నళిని చిదంబరం కేసులో మాదిరి ఉపశమనం కోరుతున్నానన్నారు. మహిళల విచారణకు సంబంధించిన మార్గదర్శకాలపై కూడా స్పష్టత చేయాలని కోర్టును కవిత కోరారు.

సెప్టెంబర్ 15న జరిగిన విచారణలో కవిత పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి పది రోజులు గడువు కావాలని ఇడి తరపు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణకు హాజరు కావాలని కవితకు ఇచ్చిన నోటీసులను కూడా పది రోజులు వాయిదా వేశారు. గడువు పూర్తి కావడంతో జడ్జి సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం మంగళవారం పిటిషన్‌పై విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో ఎంఎల్‌సి కవితకు ఊరట లభించింది. ఇడి విచారణను సవాలు చేస్తూ గతంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఇడి మరోసారి నోటీసులు జారీ చేయడంపై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. గతంలో దిల్లీ లిక్కర్ స్కామ్‌పై విచారణ సందర్భంగా ఇడి మొదటిసారి ఎంఎల్‌సి కవితకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళల్ని ఇంటిలో విచారించాలని, నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసుల్లో దాఖలైన పిటిషన్లను కవిత ఉటంకించారు. తనకు కూడా విచారణ నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News