‘అధికారం కోల్పోయాక తెలంగాణలో రైతులున్నారన్న స్పృహ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు రావడం సంతోషకరం. ఆయనకు రైతులు గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తున్నా’నని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోకపోయి ఉంటే, కిందపడి కాలికి చికిత్స జరిపించుకుని ఉండకపోతే, కూతురు కవిత జైలుకు వెళ్లి ఉండకపోతే కెసిఆర్ మనకు కనిపించి ఉండకపోవచ్చునని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. సామాన్య మానవుడిగా ఆయనపట్ల తమకు సానుభూతి ఉందన్నారు. ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయమన్నారు. కాంగ్రెస్ తోనే కరవు వచ్చిందన్న కేసీఆర్ మాటలకు రేవంత్ అభ్యంతరం తెలిపారు. 80వేల పుస్తకాలు చదివిన కెసిఆర్ కు వానాకాలం, చలికాలం ఎప్పుడొస్తాయో తెలియదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చిందని, వానాకాలంలో వానలు పడకపోవడం వల్లే ప్రస్తుతం కరవు పరిస్థితి నెలకొందని చెప్పారు. కెసిఆర్ 10 ఏళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు.
ఈ ప్రభుత్వం పోవాలని కెసిఆర్ అనుకోవడాన్ని రేవంత్ తప్పుపట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్నకేసీఆర్ కు అదేం కోరిక అని ప్రశ్నించారు. గతంలో తామెప్పుడూ ఆయన అధికారం పోవాలని కోరుకోలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ బాగా పనిచేయాలని, ప్రజల్లో బాగా తిరగాలని రేవంత్ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. కెసిఆర్ సూచనలు ప్రజలకు ఉపయోగపడతాయంటే నూరు శాతం తమ ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. 100 రోజుల్లోనే ప్రభుత్వం విఫలం చెందిందని, కూలాలని అనుకోవడం సరికాదన్నారు.
మీడియా మిత్రులు గతంలో తమకు సహకరించిన విధంగానే ఇండియా కూటమి విజయానికి కూడా సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.