పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్ పార్ట్‌ను పూర్తి చేయడం కోసం సినిమా యూనిట్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఇటీవలే ఓ లాంగ్ షెడ్యూల్ సైతం పూర్తి చేసినట్లు తెలిసింది. ఇందులో పవన్ కళ్యాణ్ సహా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలో ఈ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. మునుపెన్నడు చూడని సరికొత్త పవన్ ని తెరపై చూస్తారని అంటున్నారు. షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫోటోలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాత ఎ.ఎం రత్నం సినిమా గురించి మాట్లాడుతూ ..“ఈమధ్యనే ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. షూట్ అంతా బాగా వచ్చింది. ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ పై అలాంటి సన్నివేశాలు చూసి ఉండరు. కొత్త అనుభూతిని పంచే సన్నివేశాలవి. అభిమానులకైతే డబుల్ కిక్ ఇచ్చే సన్నివేశాలవి” అంటూ వీరమల్లుని ఆకాశానికి ఎత్తేశారు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా.. రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ బెన్ లాక్ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.