Monday, December 23, 2024

కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ వెనుక కోచింగ్ కేంద్రాల మాఫియా ఉంది

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి సిఎం రేవంత్‌ రెడ్డి
లబ్ది పొందాలని చూస్తున్నారు

బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ వెనుక కోచింగ్ కేంద్రాల మాఫియా ఉందని బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కొత్త నోటిఫికేషన్ల ద్వారా మళ్లీ కోచింగ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, దీంతో నిరుద్యోగులపై ఆర్ధిక భారం పడుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉందని, దానిని పట్టించుకోకుండా పాత నోటిఫికేషన్ రద్దు చేసి, మళ్లీ కొత్తగా వాటికి కొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. గ్రూప్ -2 పరీక్షను వెంటనే పెట్టాలని, మళ్లీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయకుండా అదే నోటిఫికేషన్‌ను కొనసాగించాలని చెప్పారు. కొత్తవి కాకుండా పాత నోటిఫికేషన్ల ద్వారా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీడియా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు అనేక సభల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడుతాడు…నోటిఫికేషన్లు వేస్తాడు అని నిరుద్యోగులు ఆశ పడ్డారని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతని నమ్మించి మోసం చేశారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బిస్వాల్ కమిటీ అని చెప్పారని, ఆ కమిటీ నివేదికను బయట పెట్టడం లేదని అన్నారు. గతంలో కోదండరాం రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నారని, ఇప్పుడు ఆయన ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు పెట్టుకున్నారు కానీ ఒక్క సమావేశంలో కూడా జాబ్ క్యాలెండర్‌పై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. నోటిఫికేషన్‌లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.

బిఆర్‌ఎస్‌వి నాయకుడు బాలు బీఆర్‌ఎస్వీ నాయకుడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా గతంలో కెసిఆర్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలకు నియామక పత్రాలు ఇచ్చారని అన్నారు. కేవలం ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారని, అది కూడా గత కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు అదనంగా మరో 60 పోస్టులు కలిపి ఇచ్చారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మాయ చేస్తున్నారని విమర్శించారు. మెగా డిఎస్‌సి అన్నారని, అది ఎటు పోయిందని ప్రశ్నించారు. వెంటనే ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నలుగురు గురుకుల విద్యార్థులు చనిపోతే ఒక్క కాంగ్రెస్ మంత్రి స్పందించలేదని విమర్శించారు. ఎంఎల్‌సి పదవి రాగానే ఎన్‌ఎస్‌యుఐ నాయకుడి గొంతు ఎందుకు ముగబోయిందని నిలదీశారు. తమ నాయకురాలు ఎంఎల్‌సి కవిత వెళ్లి వారికి అండగా నిలిచి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News