Wednesday, January 22, 2025

బిజెపికి సవాల్‌గా మారిన మ్యానిఫెస్టో

- Advertisement -
- Advertisement -

మ్యానిఫెస్టోలోనూ వెనుకబడ్డ బిజెపి
లోపాలు, రాంగ్‌స్టెప్‌లపై వాడివేడి చర్చ
గ్యాస్‌బండతో బిజెపికి భారీ డ్యామేజి?
బిఆర్‌ఎస్ కంటే మెరుగైన మ్యానిఫెస్టో కష్టమే..

జనానికి భరోసా బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టో
ప్రజల్లోకెళ్ళిన కెసిఆర్ భరోసా
పర్వాలేదనిపించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలపైనే చర్చ

మన తెలంగాణ / హైదరాబాద్: ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకైనా దికూచీలాంటి మ్యానిఫెస్టోను తయారుచేసి ప్రజలకు చేరువయ్యే విషయంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) వెనుకబడిపోయిందనే విమర్శలు కమలం పార్టీలోని కొందరు సీనియర్ నాయకులే తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. అధికార బిఆర్‌ఎస్ పార్టీ ప్రజారంజకంగా మ్యానిఫెస్టోను తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళిందని, ఎంతో దూకుడుగా కారు పార్టీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందుందని పలువురు బిజెపి నాయకులే అంగీకరిస్తూనే తమ లోపాలపై నేతలు తీవ్రంగా చర్చించుకొంటున్నారు.

బిజెపి రాష్ట్ర నాయకులు, అధిష్టానం పెద్దలు చేసిన తప్పులు, రాంగ్‌స్టెప్‌లపైనే కమలం పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి పార్టీ ప్రతిష్ట పెరిగిందని సంబరపడిన అనతికాలంలోనే ఏకంగా బొక్కబోర్లా పడిన స్థాయికి చేరుకోవడం బాధగా ఉందని పలువురు సీనియర్ నేతలంటున్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, సీనియర్ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు, ఈ కుమ్ములాటలను సద్దుమణిగించడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినే మార్చడం వంటివి బిజెపి అధిష్టానం చేసిని రాంగ్‌స్టెప్ అని, అధ్యక్షుడి మార్పు, కొత్త అధ్యక్షుడికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టడం వంటి పరిణామాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రూపు రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలను ఖాతరు చేయకుండా గట్టిగా నిలబడే బిజెపి అధిష్టానం మొదటిసారిగా గ్రూపులకు తలొగ్గి తీసుకొన్న నిర్ణయమే కొంపముంచిందని అంటున్నారు.

ప్రస్తుతం అధికార బిఆర్‌ఎస్, విపక్షమైన కాంగ్రెస్ పార్టీల మ్యానిఫెస్టోల కంటే మెరుగైన మ్యానిఫెస్టోను తయారు చేయడం కష్టమేనని ఆ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా వంటగ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటిన వైనం మొత్తం ప్రజలకు కళ్ళ ముందే కనిపిస్తుంటే వాటిని సమర్ధించుకోవడానికి తమ దగ్గర ఎలాంటి పదాలు లేకపోవడం అతిపెద్ద మైనస్ పాయింట్‌గా భావిస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ వంటగ్యాస్ సిలిండర్‌ను ఏకంగా 400 రూపాయలకు ఇస్తామని, ఒక్కొక్క సిలిండర్‌పై ఏకంగా 550 రూపాయలను సబ్సిడీగా భరించడానికి కారు పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశం చాలా కీలకమైనదని కమలం పార్టీ నేతలంటున్నారు. ఇక ఇంత కంటే మెరుగైన హామీని తాము ఇవ్వలేమని కొందరు బిజెపి నేతలు వెల్లడించారు. ఎందుకంటే సిద్దాంత పరంగా బిజెపి సబ్సిడీలు, రాయితీలకు పూర్తిగా వ్యతిరేకమని, ఈ విషయం రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసునని, అదీగాక రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే ఇలాంటి హామీ ఇవ్వాల్సి ఉంటుందని, వీటన్నింటికంటే ముందుగా తాము ఏ హామీని ఇవ్వాలన్నా అందుకు బిజెపి జాతీయ నాయకత్వం నుంచి ఆమోదముద్ర పడాల్సి ఉంటుందని, ఇలాంటి సబ్సిడీలకు అధిష్టానం నుంచి ఎలాంటి మద్దతు లబించదని అంటున్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ గ్యాస్ బండను 400 రూపాయలకే పేదలకు ఇస్తామని షాకివ్వగా కాంగ్రెస్ పార్టీయేమో వంటగ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకు ఇస్తామని హామీతో ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించడం జరిగినందున ఇక అంతకంటే ఈ అంశంపై తాము మెరుగైన హామీని ఇవ్వడం సాధ్యపడుతుందా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక రైతుల రుణాల మాఫీగానీ, కెసిఆర్ భరోసాగా కొత్తగా చెప్పిన పది ప్రధానమైన హామీలతో బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల్లో సానుకూలమైన మార్కులు కొట్టేసిందని అంటున్నారు. ఆసరా పెన్షన్లను 6,016 రూపాయలకు పెంచడం, రైతు బంధులో ఎకరానికి 18 వేల రూపాయలకు పెట్టుబడి సాయాన్ని పెంచడం, ప్రతి ఇంటికీ కెసిఆర్ భీమా పథకాన్ని 5 లక్షల రూపాయలతో ప్రవేశపెడుతుండటం, సౌభాగ్యలక్ష్మీ పథకంతో మహిళలకు నెలకు 3 వేల రూపాయలు, ఆరోగ్య రక్ష, అన్నపూర్ణ పథకం వంటివి ప్రజల్లోకి విశేషంగా చేరుకున్నాయని, బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోపై జనానికి భరోసా వచ్చిందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో ఎక్కువగా రెండు లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామనే హామీ రైతాంగాన్ని ఆకట్టుకుందని, ఇలాంటి హామీకి తాము ఇవ్వలేమని, ఇలాంటి హామీకి న్యూఢిల్లీ పెద్దలు ఆమోదం తెలపరని అంటున్నారు. అభ్యర్ధుల ఎంపిక, మ్యానిఫెస్టో రూపకల్పనలపై రాష్ట్ర బిజెపి నాయకులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటోందని అంటున్నారు. ప్రజల అంచనాలు, ఆశలకు పార్టీ సిద్దాంతాలకు మధ్య సమతూకం పాటించడం, సమతుల్యతను సాధించడం పార్టీ పెద్దలకు అతిపెద్ద సవాల్‌గా మారిందని అంటున్నారు.

అందుకే ప్రభుత్వ పాలనలో ఉన్న కొద్దిపాటి లోపాలను ఎత్తిచూపుతూ సెంటిమెంట్‌ను రగిలించడానికి, హిందూత్వ వాదనలతోనూ, అధికార బిఆర్‌ఎస్ పార్టీపైనగానీ, కాంగ్రెస్ పార్టీలపైన విమర్శలకే పరిమితమవుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే కేవలం ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలకే పరిమితమైతే ఎన్నికల్లో ఎంత మేరకు ప్రయోజనం చేకూరుస్తుందనే అంశాలపైన కూడా చర్చించుకొంటున్నారు. కేవలం విమర్శలు, ఆరోపణలకే పరిమితమవుతూ అధికారంలోకి వస్తే తాము ఏమేం మంచి పనులు చేస్తామోననే అంశాలను ప్రజలకు వివరించడానికి కమలం పార్టీ నేతల పెద్దగా సబ్జక్టు లేదని మరికొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో నాయకులు రకరకాల ఆలోచనలతో ఎన్నికల బరిలో నిలవడానికి పెద్దగా ఆసక్తిని చూపడంలేదని అంటున్నారు. అయితే కమలం పార్టీకున్న ఓటు బ్యాంకును పెంచుకునేందుకు జాతీయ భావజాలంతో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉపక్రమిస్తున్నామని, అందుకు ఈ ఎన్నికలను కూడా ప్రధాన వేదికలుగా, అవకాశంగా మలుచుకొంటున్నామని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News