Tuesday, January 21, 2025

పనివంతులకే పట్టం కట్టాలి

- Advertisement -
- Advertisement -

ప్రజలు తమ ఆకాంక్షలను గెలిపించుకోవాలి 
అన్నీ ఉన్నా రైతాంగం ఆత్మహత్యలు శోచనీయం
పథకాలపై కేంద్రాన్ని నిలదీయాలి 
బిఆర్‌ఎస్ పార్టీ మాత్రమే కాదు.. భారత్‌ను మార్చే మిషన్: బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్

హైదరాబాద్: 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో కేంద్రంలోని పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి నిర్లక్ష్యంగానే కొనసాగుతుందని, దశ, దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్‌కు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని, ఈ దిశగా చైతన్యమై, పార్టీలను కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ ఫౌండర్లు, సిద్ధాంతకర్తలు, తాతల తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేసే పరిస్థితులు చెల్లవని, ఇప్పుడు దేశ ప్రజలకు పేర్లతో పనిలేదని, పని చేయగలిగిన వాళ్లతోనే పని (నామ్ దారీ నహీ కామ్ దారీ హోనా చాహియే) అని కెసిఆర్ స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్ మాజీ ఎంపి బుద్దసేన్ పటేల్ ఆధ్వర్యంలో..
బిఆర్‌ఎస్ పార్టీ విధానాలు, పార్టీ జాతీయ అధ్యక్షుడు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నేతలు, మేధావి, సామాజిక తదితర వర్గాలు ఈ పార్టీలో చేరుతున్నారు. మధ్యప్రదేశ్ బిఆర్‌ఎస్ సమన్వయకర్తగా మాజీ ఎంపి బుద్దసేన్ పటేల్ ను అధినేత నియమించడంతో అక్కడ పార్టీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పటేల్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు సహా మరో రెండువందల మంది కీలక రాజకీయ నాయకులు ఆదివారం సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కెసిఆర్ గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దాదాపు 200ల మంది నాయకులు
మధ్యప్రదేశ్ బిఆర్‌ఎస్ సమన్వయకర్త మాజీ ఎంపి బుద్దసేన్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో చాంద్వాడా జిల్లా, జున్నార్ దేవ్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్‌దాస్ యికే సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ మస్కోలేతో పాటు దాదాపు 200 మంది సీనియర్ రాజకీయనాయకులు ప్రజా సంఘాల నేతలు మేధావులు తదితరులు బిఆర్‌ఎస్ లో చేరారు.

అన్నీ ఉన్నా రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయం
ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ఈ దేశంలో ప్రకృతి ప్రసాదించిన నీరు, వ్యవసాయ యోగ్యమైన భూమి, విద్యుత్‌కు అవసరమైన బొగ్గు నిల్వలు, వ్యవసాయానికి అవసరమైన సమతల శీతోష్టస్థితి సూర్యరశ్మి తదితర ప్రకృతి వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. అన్నీ ఉన్నా కూడా ఇంకా దేశ రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయమన్నారు. కేంద్రంలోని పాలకులకు లక్ష్యశుద్ధి లోపించడమే ఇందుకు కారణమన్నారు. దళితులు, బహుజనులు సహా అన్ని వర్గాలు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అన్యాయానికి గురవుతు న్నారని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా చైతన్యం కావాలని సిఎం పిలుపునిచ్చారు.

ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే..
ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే ఆ పార్టీల పేర్లే మారుతాయని, ఆ నాయకుల పేర్లు మారుతాయని, కానీ, ప్రజలకు ఒరిగేదేమీ లేదని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పని విధానంలో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే (నామ్ బదల్నేసే కుచ్ నహీ హోతా…కామ్ బదల్నా చాహియే) నని కెసిఆర్ స్పష్టం చేశారు.

పథకాల గురించి కేంద్రాన్ని నిలదీయాలి
బిఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే గెలిచిన రెండేళ్లలో భారతదేశ ప్రజలకు రైతాంగానికి అవసరమైన విద్యుత్‌ను 24 గంటలు అందచేస్తామని సిఎం పునరుద్ఘాటించారు. బిఆర్‌ఎస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, భారత దేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ అని ఆయన స్పష్టం చేశారు. మన ఓటును పని చేయని వాళ్లకు కాకుండా మన కోసం పనిచేసుకునే వారికి ఓటు వేసుకుంటేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో దశాబ్ధి ఉత్సవాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ఆసరా ఫించన్లు వంటి పథకాల గురించి వారికి కెసిఆర్ వివరించారు. తెలంగాణలో ఈ పథకాలన్నీ అమలవుతున్నప్పుడు మధ్యప్రదేశ్‌లో అవి ఎందుకు అమలు కావనీ ఆయన ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను కేంద్రాన్ని అడగాలని కెసిఆర్ వారికి సూచించారు. మన కష్టాలను ఇతరులు తీర్చరని మనమే తీర్చుకోవాల్సి ఉంటుందన్నారు.

‘దిల్ వాలే దిమాఖ్ వాలే’ ఐక్యం కావాలి
ఈ దేశంలో ఏడు దశాబ్ధాలు దాటిన ఆదివాసీలు, దళితులు, బహుజనులు పీడితులుగానే కొనసాగాల్సిన దుస్థితి ఇంకెన్నాళ్లని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఉత్తరభారతంలో కనీస జీవన విలువలు లేకుండా వివక్షకు గురిచేస్తున్నారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం మార్పు కోరుకుంటుందని, ఈ దిశగా బుద్ధిజీవులు ఆలోచన చేయాలన్నారు. మేధావి వర్గం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి రావాలన్నారు. ‘దిల్ వాలే దిమాఖ్ వాలే’ ఐక్యం కావాల్సిన అవసరముందన్నారు. తప్పుడు వాగ్ధానాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలువరించడంలో ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చెందిందని కెసిఆర్ దుయ్యబట్టారు.

భోపాల్‌లో బిఆర్‌ఎస్ పార్టీకి సొంత కార్యాలయం
మధ్యప్రదేశ్ భోపాల్‌లో బిఆర్‌ఎస్ పార్టీకి త్వరలోనే సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందామని కెసిఆర్ తెలిపారు. మధ్యప్రదేశలోని అన్ని నియోజకవర్గాల్లో వాహనాలను ఏర్పాటు చేసుకొని పార్టీ భావజాలాన్ని ప్రచార సామగ్రిని గ్రామ గ్రామన తిప్పాలని ప్రజలను చైతన్యం చేయాలని అధినేత స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో రైతు దళిత మహిళ యువ బిసి వంటి 9 కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

MP leaders 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News