మనీలా : ఉత్తర ఫిలిప్పైన్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. కనీసం 36 మంది గాయపడ్డారని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వెంటనే మూసివేయడంతోపాటు ఆస్పత్రి లోని రోగులను తరలించినట్టు అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత కనిపించిందని, లగయాన్ పట్టణానికి వాయువ్యంగా 9 కిమీ దూరంలో 11 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమైందని వోల్కనాలజీ, సెస్మాలజీ సంస్థ తెలియజేసింది. బుధవారం ఉదయానికి రిక్టర్ స్కేలుపై 7.1 వరకు తీవ్రత కనిపించింది. లుజోన్ ప్రధాన ద్వీపం లోని పర్వత ప్రావిన్స్ అబ్రాలో బుధవారం ఉదయం 8.45 గంటలకు భూకంపం సంభవించింది. వందేళ్లనాటి చర్చి బాగా దెబ్బతింది. కెగయాన్ ప్రావిన్స్‌లో రెండు నగరాల్లో పవర్‌లైన్లు దెబ్బతిని విద్యుత్ ప్రసారాలు ఆగిపోయాయి.
శివారులో ఉన్న ప్రావిన్స్‌లో అనేక బ్రిడ్జిలు, రోడ్లు దెబ్బతిన్నాయి. అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ ఎలాంటి హెచ్చరికలు కానీ సూచనలు కానీ వెల్లడించలేదు. అబ్రాలో శిధిలాలు కూలి పది మందికి స్వల్పగాయాలు కాగా, లోకోస్ నోర్టేలో మరో 26 మంది గాయపడ్డారని ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ వెల్లడించారు. లావోగ్ రాజధాని లొకోస్ నోర్టే లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. రెండు స్వదేశీ విమానసర్వీసులను రద్దు చేశారు. బాటక్ సిటీలో పెద్ద ఆస్పత్రి ఐసియు యూనిట్ సీలింగ్ ఊడిపోయి పెచ్చులు పడడంతో ఆస్పత్రి నుంచి రోగులను వేరే ప్రాంతానికి తరలించారు. పాఠశాల తరగతులు రద్దు చేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేసిన ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లడానికి భయపడి గుడారాలను అడుగుతున్నారని మార్కోస్ చెప్పారు. అధికారులు రోడ్లు, భవనాలను పరిశీలిస్తున్నారని, భవనాలు కూలిపోవడం వల్ల వచ్చే నష్టాలను ఇంజినీర్లు అంచనా వేస్తున్నారని తెలిపారు.