తెలుగు జాతి నెంబర్ 1 కావాలి
దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్ధాయికి ఎదగాలి
బెంగళూరు టిడిపి ఫోరం సమావేశంలో చంద్రబాబు నాయుడు పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ / బెంగళూరు : నవశకం తెలుగువారి సొంతం కావాలని, నంబర్ వన్ గా తెలుగుజాతి ఉండాలనేదే తన విజన్ అని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో థింక్ గ్లోబల్లీ….యాక్ట్ లోకల్లీ ఉండేదని..కానీ ఇప్పుడు థింక్ గ్లోబల్లీ..యాక్ట్ గ్లోబల్లీ అనేది తన కొత్త నినాదమని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటనకు వెళ్లేందుకు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు వచ్చిన చంద్రబాబు ఇక్కడ జరిగిన బెంగుళూరు టిడిపి ఫోరం మీటింగ్‌లో పాల్గొన్నారు.
ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కెఎమ్‌ఎమ్ కన్వెన్షన్ హాలుకు చేరుకున్న చంద్రబాబు పార్టీ బెంగళూరు ఫోరం సభ్యులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “పార్టీలో మేము అన్నిరంగాల వింగ్ లు ఏర్పాటు చేశాంకానీ…మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెంగళూరు ఫోరం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీలో యువశక్తి కనబడుతోంది..భవిష్యత్ మీదే. నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా మీరు అండగా నిలబడ్డారో ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తే కనిపిస్తోంది. నేను చేసిన మంచి పనులు వల్ల నాకు మద్దతుగా 70 దేశాల్లో ఉన్న తెలుగువారు గుర్తు పెట్టుకుని ముందుకొచ్చి మద్ధతు తెలిపారు. అందుకు మనస్ఫూర్తిగా ధన్యావాదాలు, అభినందలు చెప్తున్నా. తెలుగు వారంటే గతంలో ఎపికి మాత్రమే పరిమితం. కానీ నేడు తెలుగువారు ఎపి , తెలంగాణలోనే కాకుండా చెన్నై, బెంగళూరు… ఇలా ఏ సిటీకి వెళ్లినా మన వాళ్ల ప్రతిభ కనిపిస్తుంది. ఇది ఎంతో గర్వ కారణం” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రతి ముగ్గరు ఐటి ప్రొఫెషనల్స్ లో ఒక తెలుగువాడు
మన దేశంలోనే కాదు..ప్రపంచం మొత్తంలో తెలుగు వారు విస్తరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఏ దేశానికి వెళ్లినా ప్రముఖ స్థానాల్లో మన తెలుగు వారు ఉండటం సంతోషంగా ఉంది. నేను సిఎం అయిన తొలిరోజుల్లో తెలుగు వాళ్లు అప్పటిదాకా ఎక్కువగా వ్యవసాయం చేస్తూ, వ్యవసాయ కూలీలుగా ఉన్నారని, రైతు బిడ్డ ఐటి ప్రొఫెషనల్ ఎందుకు కాకూడదు, ఒక కూలీ చేసుకునే వ్యక్తి వారి కొడుకుని ఐటి ప్రొఫెషనల్ ఎందుకు చేయకూడదు అని ఆలోచించానని అన్నారు. అందుకే నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టా. అదే ఐటి. ఎడ్ల బండ్ల నుండి డ్రైవర్ లెస్ కార్ల దాకా టెక్నాలజీ వచ్చిందని చంద్రబాబు అన్నారు. అభివృద్ధిలో చాలా ముందుకు వెళ్తున్నామని, నాడు నేను ఐటినీ ప్రారంభించినప్పడు ఎగతాళి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఐటి అంటే బెంగళూరులో మాత్రమే ఉండేదని, కానీ బెంగళూరుతో పోటీపడి హైదరాబాద్ ఉండాలని, నాలెడ్జ్ ఎకానమీతో హైదరాబాద్ ను ప్రపంచం పటంలోనే పెట్టామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.