జర్నలిస్టుల డిమాండ్స్ ను పరిష్కరించాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టియూడబ్ల్యూజె వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : మీడియా సమస్యలను పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని టియూడబ్ల్యూజె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మీడియా డిమాండ్ల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ, షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చ్ 3న, ‘జర్నలిస్ట్స్ డిమాండ్ డే’కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యూజె) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి టియూడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఆయా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది.
ఈ సందర్బంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, ప్రెస్ కమిషన్ చివరి నివేదిక 1982లో వెలువడిందని, ఆ తర్వాత దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రాకతో మీడియా దృష్టాంతంలో పెనుమార్పు వచ్చిందని తెలిపారు. ఇందుకుగాను మీడియా సమస్యలను పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జర్నలిస్టులకు స్వేచ్ఛ ముఖ్యమైందని, మీడియా సంస్థలు, జర్నలిస్టుల భద్రత, రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. శ్రమకు తగ్గ ఫలితం కోసం వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల కొరకు వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. 2007 సంవత్సరంలో జస్టిస్ మజితియా కమిటీ చేసిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని ఆయన అన్నారు. పతినిధి బృందంలో ఐజెయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రాజేష్, వి.యాదగిరి, తెలంగాణ చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జె అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్, నాయకులు చారి, మల్లికార్జున్ రెడ్డి, రఫీ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లు న్యాయమైనవే: మంత్రి కిషన్ రెడ్డి
మీడియా సంస్థలు, జర్నలిస్టుల క్షేమం కోసం ఐజెయు చేస్తున్న డిమాండ్లు న్యాయపరమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టియుడబ్ల్యూజె ప్రతినిధి బృందం సమర్పించిన వినతి పత్రాన్ని తాను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని, దాంతో పాటు వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.