సాంప్రదాయక, భావ కవిత్వాలైతే పాఠకులకు వినోదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. సామాజికాభ్యుదయ కవిత్వమైతే అలజడి, ఆక్రోశం పొంగిపొర్లేలా చేస్తుంది. అదే వైప్లవిక రాజకీయ కవిత్వమైతే వారిని ప్రజల అభ్యున్నతి కోసం చేపట్టే ఉద్యమ నిర్మాణాల్లో భాగస్వామి చెయ్యగలదు. తెలుగు సాహితీ లోకంలో ప్రాంతాలవారీగా విభజించి చూస్తే, కొద్దిమంది మాత్రమే ఉత్తమ సామాజిక, రాజకీయ కవులుగా నిలదొక్కుకుని ఉన్నారు. వారిలో ఉత్తరాంధ్ర నుండి విభిన్న సామాజిక, రాజకీయ కవిత్వాన్ని రాస్తున్న కవులలో ’బాలసుధాకర్ మౌళి’ ని ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ. అనాదిగా ఈ పోరాటగడ్డపై నిరంతర రావణకాష్టం కొనసాగింది. ప్రజలు అంతులేని ఆందోళనలకు, అవమానాలకు గురయ్యారు. అవిభజ శ్రీకాకుళం జిల్లాలో జమీందారీ వ్యతిరేక గిరిజన రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఈ ప్రాంత సాహితీ సాంస్కృతిక వేత్తలందరూ ఆ ఉద్యమంలో నేరుగా పాల్గొనకపోవచ్చు. కానీ ఆ ఉద్యమ నేపథ్యం, స్ఫూర్తి ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతీ వ్యక్తిపైన పడుతుంది. తదనంతరం అనేక ప్రజా ఉద్యమాలు ఈ నేలతల్లిపై నిరాఘాటంగా సాగాయి. ప్రపంచీకరణలో భాగంగా ఈ ప్రాంతంపై విధ్వంసకర అభివృద్ధి పడగ విప్పుతున్న నేపథ్యంలో సామ్రాజ్యవాద శక్తులకు ఎదురొడ్డి ప్రగతిశీలవాదులు జరిపిన పోరాటాలు అందరికీ ఆదర్శం అయ్యాయి.
ఈ నేలమీద విస్తారంగా ఉన్న సహజవనరులపై కార్పొరేట్ల కన్ను పడడంతో, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ఉద్దేశంతో నాయకుల అండదండలతో ప్రజలపై దాడి కొనసాగించడం షరామామూలైంది. తమ ఉనికిని, మనుగడను కాపాడు కోవడం కోసం ఈ ప్రాంత ప్రజలు అనివార్యంగా ఉద్యమాల్లో నిమగ్నమయ్యారు. సోంపేట కాకరాపల్లి, కొవ్వాడ మత్స్యలేశం, గంగవరం పోర్ట్, భోగాపురం ఎయిర్ పోర్ట్ లకు సారవంతమైన బీల భూమి సేకరణ, అడవుల్లో గనుల తవ్వకాలు, నదీ ప్రాంతాల్లో ఇసుక నిల్వల తరలింపు మొదలగు అక్రమ చర్యల ఫలితంగా ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విశాఖపట్టణం, విజయనగరం, పైడిభీమవరం, పలాస, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం మొదలగు ప్రాంతాలలో కార్మిక ఉద్యమాలు పెక్కురీతిన ఎగసిపడ్డాయి. మౌళికి ఉద్యమ నేపథ్యం ఎంత ఉందో! తెలియదు గానీ, ఉత్తరాంధ్ర ప్రాంత జ్యూట్ కార్మికోద్యమానికి దిక్సూచిలా నిలిచిన నెల్లిమర్ల గ్రామనివాసిగా ఉండడం యాదృచ్ఛికమేమీ కాదు. చంపావతి నది అతని కలం పేరు మాత్రమే కాదు. అది సంచలనం రేపిన జ్యూట్ ఉద్యమానికి సాక్షీభూతం. ఆ నదిలో కార్మికుల చెమట చిందడమే కాదు, రక్తం పారింది కూడా. వృత్తి రీత్యా సాదాసీదా ఉపాధ్యాయ జీవనం గడుపుతూ, ప్రవృత్తి రీత్యా ఎటువంటి హంగు ఆర్భాటాలకు పోని కవన జీవనం మౌళిది. మొదటిది పిల్లల్లో సృజనాత్మకత పిండడం. రెండోది సృజనాత్మకత పండించడం. మౌళి ఈ రెండింటా తన పని తాను చేసుకుంటూ, ఏడాదికి ఒకటో రెండో కవితా సంపుటలను అలవోకగా వెలువరించడం విశేషం.
ఈ క్రమంలోనే ’అస్తిత్వ వాచకం’ ను ఆవిష్కరించుకున్నారు. అతని కవిత్వం చదివితే ఖచ్చితంగా చిన్నతనము నుండే సామాజిక అవగాహన, ప్రగతిశీల దృక్పథం ఉందనవచ్చు. కర్షకులు, కార్మికులు మరియు బీద వర్గాల ప్రజల సమస్యల పట్ల సానుకూల దృక్పథం కలిగియున్నారు. అదే ఒక నిర్దిష్టమైన రాజకీయ దృక్కోణంతో కవితా గానం చేస్తున్నట్లు మౌళిని అర్థం చేసుకోవచ్చు.
’ఈ సముద్రాన్ని ఈదడం ఎలా’ అనే కవితలో స్త్రీ సాన్నిహిత్యం పురుషునికి అత్యంతావశ్యకమని గుర్తుచేసే సందర్భముంది. జననం నుండి జరామరణం వరకు స్త్రీ లేనిదే పురుషుడు జీవించలేడని కుండబద్ధలుకొట్టి చెబుతాడు. మగవాని జీవన మార్గానికి ఆడది దిక్సూచిలా నిలుస్తుందంటాడు. అంతేకాదు అతని ధైర్య సాహసాలకు, ఆత్మస్థైర్యాలకు పడతియే ప్రధాన భూమిక వహిస్తుందంటాడు కవి. ’చిన్నప్పుడు నేను అమ్మని కావలించుకుని/నిద్రపోయేవాణ్ణి/ఇప్పుడు సహచరిని/ఇద్దరి స్త్రీల ధైర్యం తోడు లేకుండాబతకడం/ సాధ్యం కాని పనేమో’
’ప్రాయశ్చిత్తం’ అనే కైతలో ఒక ఇల్లాలికి-కవికి మధ్య వృత్తి-ప్రవృత్తి ధర్మాన్ని పోలిక చేస్తాడు. అనాదిగా మహిళ వంట ఇంటికి పరిమితమైంది. రోజూ తన చేతి నైపుణ్యంతో రుచికరమైన వంటలు వండి అందరికీ అమ్మలా వడ్డిస్తుంది. అంతేకాదు తెల్లవారి లేచింది మొదలు అనేక శారీరక ఇబ్బందులు పడుతూనే సహనంతో తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తుంటుంది. అందుకే ఆమె ’క్షమయా ధరిత్రి’ అయ్యింది. మగవానికి ఆమె ఇబ్బంది లేవీ పట్టవు. కూర్చునేసరికి కూడు అందాల్సిందే కదా! ’స్త్రీ వంట చేయడం- కవి కవిత్వాన్ని రాయడం ఒకటేనా! అని కవి ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. అంటే వంట చేయడం కన్నా, కవిత్వ నిర్మాణం సులువంటాడు. వంట చేయడమే గొప్ప కార్యనిర్వహణని భావిస్తాడు.
’కవిత్వానిదేముంది/మనసు గాయపడినప్పుడల్లా/భావం స్రవించబడుతుంది/వంటలా కాదు/నిద్రలేని రాత్రి నుంచి ఆమె ఉల్కలా రాలిపడినా/నెలసరి నెత్తురు లావాలా పొంగి/దేహమంతా స్రవించినా/ఆమె ఆగదు వంట మానదు/నేను కవిత పూర్తి చేస్తాను/ఆమె వండిన వంట ముందు/నేను రాసిన కవిత శూన్యం’
స్త్రీ పురుషుల ఏకాంత సమయాలను బాధాతప్తతో ’నొప్పి’ అనే కైతలో వివరిస్తాడు. బాధ ఎలాంటిదో తెలిసినా! పురుషుడు తన పని కానిస్తాడు. తన సౌఖ్యానికే ప్రాధాన్యతిస్తాడు. మహిళా కూడా తనలాంటి మనిషే కదా! అనే ఇంగితాన్ని మరిచి స్త్రీ సౌందర్యాన్ని అనుభవిస్తాడు. ఆమె ఆరోగ్యాన్ని, వైరాగ్యాన్ని లెక్కచేయక తన భౌతిక అవసరాన్ని తీర్చుకుంటాడు మగాడు. ఇది కూడా హింసేనని కవి ఉద్ఘాటిస్తాడు. ’ఇద్దరి ఏకాంత స్వప్న తీరంలో/నది సముద్రంలో ఐక్యమౌతున్న వేళ/ఆమె నొప్పి అని అన్నది/లోకం నొప్పులను ఎరిగిన నేను/నొప్పెలా వుంటుందో తెలియనివాణ్ణి/ కాను’
కవి తన భార్య, బంధుగణం, స్నేహితులతో గడిపిన క్షణాలు ప్రతిదీ వస్తువుగా స్వీకరించి కవిత్వం రాయడం గోచరిస్తుంది. మానవీయ కోణాన్ని, ప్రజాస్వామిక జ్ఞానాన్ని నింపుకొని కవితలను అల్లడం చూస్తాం. ఇంతవరకూ కవి స్వానుభవాలు, పరిశీలనలు వస్తువులు కావడం సరే. ఆయా వస్తువులలో తన అస్తిత్వం చాటుకుంటూ, సార్వజనీనం చేయడమనేది కూడా ఓ కళే. ఆ కళను ఒడిసిపట్టుకున్న కవి మౌళి. ఈ సంపుటిలో 55 కవితలు ఉన్నాయి. కొన్ని తన కౌటుంబిక అస్తిత్వాన్ని ప్రకటిస్తే, మెజారిటీ కవితలు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని ప్రోదిచేస్తాయి.
’సముద్రము-చేపలు-వేట-వేటగాడు-పన్నాగాలు’ అంటూ కథాగమన పద్ధతిలో సాగే ’అనగనగా ఒక వేట కథ’ అనే కవితలో ఐదేళ్లకొకసారి జరిగే రాజకీయ సంకుల సమరంలో నాయకులు ప్రజలకు అనేక భ్రమలకు గురిచేస్తూ తమ పబ్బం గడుపుకోవడాన్ని ప్రస్తావిస్తాడు. తెరచాటునుండి కార్పొరేట్లు వీరికి సాయం చేయడం, తద్వారా వారి లబ్ధికి వీరు పాటుపడడం, ఈ క్రమంలో ప్రజలు మోసపోవడం మామూలుగా సాగే తంతు. దుర్రాజకీయాలను అర్థం చేసుకొని ఎదిరించాలంటాడు కవి. ’వేట ముగిసిపోయినట్టు కాదు/వలలు తెగిపోయినట్టూ కాదు/చేపలు గెలిచినట్టు కాదు చేపలు ఓడినట్టూ కాదు/మళ్లీ రేపో మాపో ఈ వేటగాడో కొత్త వేటగాడో/ సముద్రం మీదికొస్తాడు/సముద్రం చనిపోలేదు సముద్రం బతికే ఉంది/నవనవోత్తేజ రక్తం సముద్రంలో ఉప్పొంగుతుంది’ ’వైఫల్యం’ అనే కవితలో నిద్రాణంలో ఉన్న యువతరం మేల్కొని తిరుగుబాటుకు సిద్ధం కావడం ఖాయమంటాడు. ’రక్తం ఉంది సత్తువ ఉంది/నగరాలను కైవసం చేసుకునే చేవ ఉంది/ధిక్కారమే చనిపోయింది/మళ్లీ రాజ్యం తుక్కురేగ్గొట్టడానికి తయారు చేసుకునే పనిలో/నవతరం’
’అస్తిత్వవాచకం’ అనే కవితలో భాష, వేషం, చివరకు తినే ఆహారం మీద అజమాయిషి చెలాయించాలనే ఆధిపత్య వైఖరికి ముకుతాడు వేసేలా జనాన్ని కార్యోన్ముఖుల్ని చేస్తాడు. ’ఎవడి శరీరం వాడిదైనట్టు/ఎవడి భాష వాడిది/భాషని అగౌరవపరిచిన వాడిని/భాషపై అధికారం నెరిపేవాడిని/భాషని మాంత్రిక కొయ్యకు వేలాడదీసి/ఉరితీయాలనుకునేవాడిని/లోకం ఒప్పదు’.
’వెలికొండ’ కవితలో కులక్రౌర్యాన్ని ఎండగడతాడు. దాహంతో అలమటించే కడగొట్టు బిడ్డడు కుండలోని నీరును త్రాగడానికి కుండను తాకాడని విషం చిమ్మే నాగుపాముల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేలా జన చైతన్యానికి శ్రీకారం చుడతాడిలా. ’పిల్లాడిని వెలేసిన కావరమెక్కిన చేతుల్లో/ఇమిడిన కుండ వాడినే వెలేసే రోజులు/రావాలి’
చెల్లుబాటైనన్నాళ్ళూ నీ మాటను చెల్లించుకుంటావు. వినేవాళ్ళున్నన్నాళ్ళూ నీ మాటలు వల్లెవేస్తావు. నీ రాజ్యంలో నీ మూకస్వామ్యం పలాయనం చిత్తగించే రోజు రాక తప్పదని కవి హెచ్చరిస్తాడిలా. ’మాటలతో వొకసారేం వేలసార్లు మాయ చేయడం/ నీకు తెలిసిన పరమోత్కృష్ట విద్య/సరే కానివ్వు ఎంతటి వారైనా బట్టబయలుకాడానికి/ సమయమొకటి వస్తుంది/అంతవరకూ నిజం లోగొంతుకుతోనైనా మాట్లాడి/తీరుతుంది’
’రాజ్యాంగం నీ ఇంటి గుమ్మంలో వేలాడే/ దిష్టిబొమ్మ కాదు/రక్షక దళాలను న్యాయస్థానాలను/నీ ఇలాకాలో గుంజకు కట్టేసుకుని/తూతూ నిజాలను జపిస్తే మాత్రం/తప్పు ఒప్పైపోదు/నిజం నిజమే అబద్ధం అబద్దమే/నీ అబద్ధాల పుట్టని పగలగొట్టడమే/ ఇప్పుడు సరికొత్త ప్రారంభం’ అంటూ అబద్దాలను వల్లేవేసే పాలకుల ద్వంద్వ వైఖరులను దునుమాడమంటాడు కవి.
’అహంకారం చెట్టు’ లో చిట్ట చివరకు ఆధిపత్యపు చెట్లు నేలకూలక తప్పదని విశ్వసిస్తాడు కవి. ’చెట్టు కూలుతుంది నువ్వు భూస్థాపితమౌవుతావు/అహంకారం చెట్టుని నిలువునా పాతేయడానికే/మేము కాచుక్కూర్చుని ఉన్నాం’ అని ప్రజల తక్షణ కర్తవ్యాన్ని ఉద్భోదిస్తాడు. ’ఆయుధాలు పట్టాల్సిన సమయమొచ్చినప్పుడు/ఆయుధాలను పట్టడమే ఉత్తమం’ ఆయుధం పట్టి యుద్ధం మొదలెడితే దానికి అంతం ఉండదంటూ కవి తన వైఖరిని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు.
ఉత్తరాంధ్ర వెనుకకు నెట్టబడిందనీ, వనరుల వినియోగం లేనిదనీ, నయా ఉదారవాద ప్రపంచీకరణ ప్రభావంలో పడిందనీ, ప్రత్యేక ప్యాకేజీలు లేవనీ, రోగమయ ప్రాంతమనీ అనడం మామూలే. సృజనకారులైతే ఇవే సమస్యలంటున్నారు. కానీ పరిష్కార మార్గాలు చూపట్లేదు. సాహిత్యమనేది సమస్య విరుగుడుకు సాధనం కావాలి. అందుకు తెలంగాణా మాదిరి కళింగాంధ్ర ప్రజల పునరేకీరణ జరగాలి. అంటే ఈ ప్రాంత సాహితీ కళాకారులు రాజకీయ అస్తిత్వ చైతన్యాన్ని రచనల్లో రగిలిస్తూ, ఉద్యమాలు నిర్మించుకోవాలి. చివరకు ఈ ప్రాంత సమస్యలను తీర్చేది అదే. అందుకే మౌళి ఈ దారిని ఎంచుకున్నారు.