- బిజెపిని ఓడించడమే కమ్యూనిస్టుల లక్ష్యం
- సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఖమ్మం రూరల్ : పేదలకు ఎర్రజెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని తల్లంపాడు గ్రామంలో సోమవారం సుందరయ్య వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి సిపిఎం జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా వట్టికోట నరేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆదానీలకు కారు చౌకగా అమ్ముతూ ప్రజలపై పెనుబారం మోపుతున్న మోడీని గద్దెదించేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని కోరారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి బుద్ధి చెప్పడం అభినందనీయమన్నారు. 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బిజెపిని ఓడించేందుకు కమ్యూనిస్టు పార్టీలు కృషి చేస్తున్నాయన్నారు. బిజెపిని ఓడించడమే కమ్యూనిస్టుల లక్ష్యం అన్నారు. సుందరయ్య జీవితం మహోన్నతమైనదని సుందరయ్య జీవిత చరిత్రను నేటి యువత చదివి ఆయన బాటలో పయనించాలని కోరారు.
పేదలకు సేవ చేసినప్పుడే ఆ జీవితానికి సార్థకత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, సిపిఎం సీనియర్ నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, సిపిఎం మండల నాయకులు నందిగామ కృష్ణ, పి.మోహన్ రావు, ఉపసర్పంచ్ యామిని ఉపేందర్, సిపిఎం నాయకులు పల్లె శ్రీనివాసరావు,డాక్టర్ రంగారావు, గింజుపల్లి మల్లయ్య, వరగాని మోహన్ రావు, నువ్వుల నాగేశ్వరరావు, గుడిబోయిన అరవింద్ తదితరులు పాల్గొన్నారు.