లక్షెట్టిపేట : మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన గొర్రె రామయ్య (49) తండ్రి రాజలింగు గురువారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో తపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో సెక్యురిటీ విభాగంలో పని చేస్తున్న ఎస్పీఫ్ హెడ్ కానిస్టేబుల్ రామయ్య తుపాకిని శుభ్రం చేస్తుండగా చేతిలో పొరపాటున పేలింది.
ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో వెంటనే ఆయనను నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యంలోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. రామయ మరణంలో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామయ్యకు కొడుకు, కూతురు ఉన్నట్లు సమాచారం. మింట్ కాం పౌండ్‌లోని సెక్యురిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో భద్రతా విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రామయ్య ప్రాణాలు కోల్పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. భద్రత విధుల్లో ఉన్న సిబ్బంది తుపాకులను శుభ్రం చేసుకునే సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. కానిస్టేబుల్ రామయ్య వద్ద ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా, ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.