Monday, December 23, 2024

చంద్రబాబుకు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -
బెయిల్ పిటిషన్లు డిస్మిస్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టిడిపి అదినేత చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ ఎసిబి కోర్టులో కూడా ఆయన ఊరట దక్కలేదు. సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ పిటీషన్, సిఐడి కస్టడీ పిటిషన్ రెండింటినీ సోమవారం కోర్టు కొట్టివేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్లు కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటీషన్లపై ఇటీవలే ఎపి హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఎపి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి సోమవారం వెలువరించింది.

మూడు కేసుల్లోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఎపి హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఎసిబి కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అదే సమయంలో చంద్రబాబును మరోసారి కస్టడీకు ఇవ్వాలంటూ సిఐడి పిటీషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటీషన్లపై ఎసిబి కోర్టులో సుదీర్ఘవాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్, సిఐడి కస్టడీ పిటీషన్లపై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, విచారణ కీలకదశలో ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దని సిఐడి చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. మరోవైపు మరోసారి కస్టడీ కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటీషన్‌ను కూడా కొట్టివేసింది.

క్వాష్ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా వేసిన ‘సుప్రీం’
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది .సోమవారం చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు విన్పించారు. మంగళశారం ఉదయం ఏపీ సిఐడి తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. తాను ఈ విషయమై వాదనలు మంగళవారం విన్పిస్తానని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. రోహత్గీ అభ్యర్ధనను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. 17 ఏ అనేది డేట్ ఆఫ్ ఎఫ్‌ఐఆర్ వర్తిస్తుందా? లేదా డేట్ ఆఫ్ అఫెన్స్ కింద వర్తిస్తుందా? అనేది కోర్టు ముందుంచామని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు. నేరుగా నగదు తీసుకుంటూ పట్టబుడితే తప్ప మిగిలిన అన్నింటికి 17 ఎ వర్తిస్తుందని హరీష్ సాల్వే వాదించారు. ఎసిబి చట్టం కింద కేసు పెడితే ఈ పాటికి తమకు ఉపశమనం లభించేదన్నారు. రిమాండ్ రిపోర్టును ఛాలెంజ్ చేస్తున్నామని సాల్వే తెలిపారు. రిమాండ్ రిపోర్టుపైనే తమ వాదనంతా అని సాల్వే వాదించారు. 17ఎకు సంబంధించి పంకజ్ భన్సల్ కేసును హరీష్ సాల్వే ఉదహరించారు. 17 ఎకు వర్తించే అన్ని కేసుల్లో ప్రతి సందర్భంలో అనుమతి తీసుకోవాలన్నది కేంద్రం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేసిందని సాల్వే వాదించారు. డేట్ ఆఫ్ ఎఫ్‌ఐఆర్ ను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ సాల్వే వాదించారు. 2021 సెప్టెంబర్ 7న ఫిర్యాదు వస్తే 2021 డిసెంబర్ 9న ప్రాథమిక విచారణ జరిగిందని సాల్వే సుప్రీంలో వాదనలు విన్పించారు. ఈ కేసుతో డిజైన్ టెక్ కు సంబంధించిందని సాల్వే వాదించారు. ఒప్పందం ఎవరితో జరిగిందని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని సాల్వే చెప్పారు. హైకోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్లు వాదనలు పూర్తయ్యాక ఉంచుతామని మీరు చెబుతున్నారని ఆ డాక్యుమెంట్లలో ఉన్నదానిపై కౌంటర్ దాఖలు చేసే సమయం మీకు లేకపోయిందా? అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. 17ఎ అనేది అవినీతి నిరోధానికి ఉండాలే కానీ కాపాడేందుకు కాదని జస్టిస్ త్రివేది గుర్తు చేశారు.

అమరావతి ఐఆర్‌ఆర్ కేసు మరో నలుగురి పేర్లను చేర్చిన సిఐడి
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఎపి సీఐడీ అధికారులు మరో నలుగురి పేర్లను సిఐడి అధికారులు ఈ కేసులో చేర్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఎపి సిఐడి అధికారులు సోమవారం కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో మరో నలుగురి పేర్లను చేర్చారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి,ఆవుల మణిశంకర్, సాంబశివరావు,ప్రమీల పేరును ఎపి సిఐడి చేర్చింది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో తమకు చెందిన వారికి లబ్ది చెందేలా మార్పులు చేశారని చంద్రబాబు, నారాయణలపై ఎపి సిఐడి అభియోగాలు మోపిన సంగతి విదితమే. అమరావతి అసైన్డ్ భూముల కేసులో కూడ మాజీ మంత్రి నారాయణపై ఎపి సిఐడి అభియోగాలు మోపింది.ఈ కేసుకు సంబంధించి నారాయణ సహా పలువురికి ముందస్తు బెయిల్ ను ఎపి హైకోర్టు మంజూరు చేసిన సంగతి విదితమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News