పరిస్థితులను పరిశీలిస్తున్న తల్లిదండ్రులు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ భయంతో పాఠశాలల్లో హాజరు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రీ స్కూళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో హాజరు తగ్గినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా కొవిడ్ వైరస్ వ్యాప్తి, దాని తీవ్రతను పరిశీలించిన తర్వాత పిల్లలను రెగ్యులర్‌గా స్కూళ్లను పంపిద్దామని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసులు పెరుగుతున్న క్రమంలోనే క్రిస్మస్ సెలవులు రావడంతో తల్లిదండ్రులు కొంత ఊపిరిపీల్చుకున్నారు. అయితే మంగళవారం నుంచి మళ్లీ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్ కేసుల పెరుగుదల, దాని తీవ్రతపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత పిల్లలను స్కూళ్లకు పంపించే అవకాశం కనిపిస్తోంది.అయితే చాలా పాఠశాలలు ముందస్తు జాగ్రత్తలలో భాగంగా విద్యార్థులకు మాస్క్‌లు, శానిటైజర్ తప్పనిసరి చేశాయి.
కొత్త వేరియంట్ తీవ్రత తక్కువే : నిపుణులు
కొవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత తక్కువేనని, ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, ఇతర ముప్పు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మాస్క్‌లు ధరించడం మంచిందని చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు అందరూ కనీసం 6 మీటర్ల భౌతికదూరం పాటించడం చాలా ముఖ్యమని అంటున్నారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని, ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే మాస్క్ ధరించి, హ్యాండ్ వాష్‌తో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడాలని, అలాగే ప్రయాణాలలో భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. జ్వరం, జలుబు, ముక్కుకారడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, గొంతు నొప్పి, నీరసం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.