Sunday, December 22, 2024

మద్యం వ్యాపారులకు ఉద్దెర ఆఫర్!

- Advertisement -
- Advertisement -

సరుకు ముందు తీసుకెళ్లండి…డబ్బులు తరువాత చెల్లించండి
మద్యం అమ్మకందారులకు ఎక్సైజ్ అధికారుల ఫోన్

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎక్సైజ్ శాఖ మద్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొన్నటి వరకు డబ్బులు చెల్లిస్తేనే లిక్కర్ సరఫరా చేసిన ఎక్సైజ్ శాఖ ప్రస్తుతం మద్యం వ్యాపారుల కోసం ఉద్దెర ఆఫర్‌ను ప్రకటించింది. ఎంత కావాలంటే అంత సరుకు తీసుకెళ్లండి డబ్బులు తర్వాత చెల్లించండని ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ సమీపిస్తుండడంతో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలను పెంచుకోవాలన్న ఉద్ధేశ్యంతో వ్యాపారులకు ఈ ఆఫర్ ప్రకటించినట్టుగా తెలిసింది.

ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత లిక్కర్ ఉత్పత్తి, సరఫరాపై ఈసీ నిఘా వేయనుంది. డిస్టలరీ నుంచి ఏ మేరకు లిక్కర్ ఉత్పత్తి అవుతుంది?.. ఏ జిల్లాకు ఎంత మేరకు అదనంగా వెళుతుందన్న దానిపై మానిటరింగ్ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఎక్సైజ్ శాఖ కొత్త రకం స్కీంను ఎంచుకుందని మద్యం వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మద్యం షాపుల యజమానులకు ఎక్సైజ్ అధికారులు ఫోన్ చేసి అదనపు కోటా తీసుకెళ్లాలని, డబ్బులు లేకపోతే క్రెడిట్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇంతకాలం పైసలు కట్టిన తర్వాతే సరుకు ఇచ్చే ఎక్సైజ్ శాఖ ప్రస్తుతం ఈ ఆఫర్‌ను ప్రకటించడంతో మద్యం వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా వైన్‌షాపుల లైసెన్సులు దక్కించున్న వారు కొత్త వ్యాపారం ప్రారంభించనుండగా అంతలోపు నవంబర్ 30వ తేదీ వరకు పాత మద్యం వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగించనున్నారు. దీంతోపాటు నవంబర్ చివరన లేదా డిసెంబర్ మొదటివారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను భారీగా పెంచుకోవాలని ఈ కొత్త ఆఫర్‌ను ప్రకటించినట్టుగా తెలిసింది. ఈ ఆఫర్ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు ఫోన్ చేసి చెబుతున్నట్టుగా సమాచారం.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News